మొహాలీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ బాదిన సిక్సర్ తాకి ఓ కానిస్టేబుల్ కోల్పోయిన ఘటన మరవకముందే మళ్లీ అలాంటి ప్రమాదం చోటు చేసుకంది. మిల్లర్ ఫుల్ షాట్ ప్రాక్టీస్ సమయంలో బంతి ఓ పిల్లాడి చాతికి బలంగా తాగింది.
దీంతో స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోయిన బాలుడిని పంజాబ్ క్రికెట్ సంఘం ఆసుపత్రికి తరలించింది. వైద్య పరీక్షల అనంతరం బాలుడు క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. గాయపడ్డ బాలుడి వయస్సు పదేళ్లు ఉంటుంది. అతని పేరు సిద్దార్థ్ ఉపాధ్యాయ.
సిద్ధార్థ్ ఉపాధ్యాయ భోపాల్‌కు చెందిన బాలుడు. అతను తన తండ్రి మయాంక్ ఉపాధ్యాయతో కలిసి శనివారం మధ్యాహ్నం మ్యాచ్ చూసేందుకు వచ్చారు.
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూసేందుకు ఉత్సాహంగా వెళ్తున్న ప్రేక్షకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెండు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ మ్యాచులో పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ భారీ సిక్సర్ కొట్టాడు. బంతి స్టేడియంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కంటికి బలంగా తగిలింది.

దీంతో అతడు ఆ కంటి చూపు కోల్పోవాల్సి వచ్చింది. ఆనంద్ బజార్ పత్రిక ప్రచురితం చేసిన కథనం ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు తలపడిన మే 9న ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 57ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ అలోక్ ఐచ్ జి బ్లాక్‌లోని అప్పర్ టైర్‌లో ఉండి మ్యాచును చూస్తున్నాడు.
అతడు కోల్‌కతా 5వ బెటాలియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాహనానికి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా, అతడు మ్యాచు వీక్షిస్తున్న సమయంలోనే ఆండ్రూ రస్సెల్ వేసిన బంతిని పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఈ బంతి నేరుగా వెళ్లి కానిస్టేబుల్ అలోక్ కుడి కంటికి తగిలింది. దీంతో ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోయాడు. గమనించిన సిబ్బంది అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. క్రికెట్ బంతి బలంగా తగిలిన కారణంగా ఆ కంటి చూపును తిరిగివ్వలేకపోయారు వైద్యులు.