సిడ్నీ: బాక్సింగ్ ఆట మరో క్రీడాకారుడిని బలితీసుకుంది. న్యూ సౌత్ వేల్స్‌లో జరిగిన రీజినల్ టైటిల్ పోరులో ఆస్ట్రేలియా బాక్సర్ డేవీ బ్రౌన్(28) బాక్సింగ్ చేస్తుండగా కుప్పకూలిపోయాడు. ప్రత్యర్థి డేవీకి బలమైన పంచ్ ఇచ్చాడు.
దీంతో డేవీ ఒక్కసారిగా కోర్టులో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెదడుకు బలమైన గాయం తగలడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య గత శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ సూపర్ ఫెదర్ వెయిట్ పోరులో.. డేవీ బ్రౌన్ 12 రౌండ్‌ల పాటు తీవ్రంగా పోరాడి.. మరో 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా ప్రత్యర్థి కార్లో మగలి (ఫిలిపీన్స్) పంచ్‌కు తాళలేక రింగ్‌లో కుప్పకూలాడు.
దీంతో ప్రత్యర్థికి నాకౌట్ విజయం దక్కింది.

కాగా, కొద్దిసేపటి తర్వాత తేరుకున్న డేవీ లేచి కుర్చీలో కూర్చున్నాడు. కానీ, నియంత్రణలో కనిపించలేదు. కాసేపటికే ఉన్నట్టుండి నేలకొరిగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడికి అత్యవసర చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు.
మొదడుకు బలమైన గాయమైన అతడిని బతికించేందుకు ఆస్పత్రి వర్గాలు నాలుగు రోజులు శ్రమించాయి. కానీ, ఫలితం లేకపోయింది. మ్యాచ్‌లో ఆఖరివరకు పోరాడి ఓడిన డేవీ.. పంచ్ తాలూకు గాయం నుంచి కోలుకునేందుకూ తీవ్రంగా పోరాడి చివరకు ఓడిపోయాడు. కాగా, గత మార్చిలో ఆస్ట్రేలియా బాక్సర్ బ్రేడన్ స్మిత్ కూడా డేవిలాగే ప్రాణాలు కోల్పోయాడు.