గ్లాస్గో: పతకాలతో క్రీడాకారులు తమ భారదేశ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంటే అధికారులు మాత్రం దేశం పరువు తీసే పనిలో పడ్డారు. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ అవమానానికి గురయ్యే సంఘటన శనివారంనాడు చోటు చేసుకుంది.
భారత ఓలింపిక్ సంఘం (ఐఓఎ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఆ కేసులో అరెస్టయ్యారు. దానికితోడు, రెజ్లింగ్ రెఫరీ వీరేందర్ మాలిక్‌ను స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. మాలిక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరు కూడా అధికారికంగా భారత బృందంతో క్రీడా గ్రామంలో కాకుండా గ్లాస్గోలోని ఓ హోటల్‌లో ఉంటున్నారు.

మాలిక్‌కు జట్టుతో సంబంధం కూడా లేదని అంటున్నారు. వారిద్దరినీ అరెస్టు చేసిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. శనివారంనాడు 45, 49 ఏళ్ల వయస్సు గల ఇద్దరు వ్యక్తులను వేర్వేరు చోట్ల భిన్నమైన ఆరోపణల్లో అరెస్టు చేశామని ఓ ఉన్నతాధికారి వెళ్లడించారు.
పోలీసులతో తాము మాట్లాడినట్లు, తదుపరి దర్యాప్తునకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు ఎడిన్‌బర్గ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పడే వెల్లడించలేమని స్థానిక పోలీసులు అంటున్నారు.