న్యూఢిల్లీ: దుస్తులపై పడే మరక మంచిదేమో గానీ.. దేశ ప్రతిష్ఠపై పడే మరక ఏ మాత్రం మంచిది కాదు. దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయం ఇది. క్రీడారంగానికి సంబంధించినంత వరకూ డోపింగ్ నేరం. అలాంటిలాంటి నేరం కాదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటి డోపింగ్ మరోమారు దేశ క్రీడారంగంపై పడింది. ఒడిశాకు చెందిన వెయిట్ లిఫ్టర్ రవికుమార్ కుటులు యాంటీ డోపింగ్ పరీక్షలో విఫలం అయ్యారు. దీనితో ఆయనను సస్పెండ్ చేసింది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. సాధారణ వెయిట్ లిఫ్టర్ కాదాయన. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించారు.
2010లో దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన కామన్వెల్త్ గేమ్స్‌లో రవికుమార్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడలిస్ట్. విశాఖపట్నం వేదికగా ఇటీవలే నిర్వహించిన 71వ పురుషుల జాతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడల సందర్భంగా రవికుమార్ డోప్ తీసుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. ఈ క్రీడల్లో కూడా రవికుమార్ 342 స్నాచ్ విభాగంలో బంగారు పతాకాన్ని సాధించారు. 89 కేజీల క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో గోల్డ్ మెడలిస్ట్గా నిలిచాడు. దీనితో అతనిపై చర్య తీసుకోవాలని సిఫారసు చేసింది యాంటీ డోపింగ్ ఏజెన్సీ.