
హైదరాబాద్: ఇటీవల ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో మెరిసిన 16 ఏళ్ల మను బకర్‌కు అవమానం జరిగింది. ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆమె స్వస్థలమైన చర్ఖి దాద్రి పట్టణంలో పతకాలు గెలిచిన క్రీడాకారులను మంగళవారం హర్యానా ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.
అయితే, ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న 16 ఏళ్ల మనూ బకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఫోగట్ ఖప్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మనూను కుర్చీలో కూర్చోబెట్టి సన్మానించారు. అనంతరం పలువురు స్థానిక పెద్దలు రావడంతో వారు కూర్చొనేందుకు మనూ కుర్చీని ఖాళీ చేసింది.

ఈ క్రమంలో మను బకర్ ఓ స్టార్ అన్న సంగతే మరిచిపోయారు. పూల దండలతో కూర్చీ మీద కూర్చున్న మను బకర్.. ఆ తర్వాత అతిథుల రాకతో వాళ్ల కాళ్ల దగ్గర నేల మీద కూర్చోవాల్సి వచ్చింది. ఆమె నేలపైనే కూర్చున్నా, నిర్వాహకులెవరూ పట్టించుకోకపోవడం వివాదాస్పదమైంది.
అయితే ఈ ఘటనను మను బకర్ తండ్రి రామ్ కిషన్ మాత్రం తేలికగా తీసుకున్నాడు. మనుకు ఎలాంటి అవమానం జరగలేదని అంటున్నాడు. ఇది తమకు అవమానం కాదని, పెద్దలపట్ల ఉన్న గౌరవంతో తన కూతురే లేచి కింద కూర్చుందని వివరణ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో రెజ్లర్లు వినేష్ ఫోగట్, బబిత కుమారిలను కూడా సన్మానించారు.