
హైదరాబాద్: గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. శనివారం పోటీల్లో భాగంగా భారత్‌కు అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం లభించింది. జావెలిన్ త్రోలో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా స్వర్ణం పతకం సాధించాడు.
నీరజ్ తన జావెలిన్‌ను 86.47 మీటర్ల దూరం విసిర స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో నీరజ్‌కు ఇదే బెస్ట్ త్రో కావడం విశేషం. అంతేకాదు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం రావడం ఇదే తొలిసారి. తాజాగా నీరజ్ స్వర్ణం నెగ్గడంతో భారత స్వర్ణ పతకాల సంఖ్య 21కి చేరుకుంది.
ఇదే జావెలిన్‌లోనే మరో భారత అథ్లెట్ విపిన్ కాషాన్ 77.87మీ దూరం త్రో చేసి ఐదో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో వ్యక్తిగత ఈవెంట్లలో భారత్‌కు స్వర్ణం రావడం ఇది నాలుగవ సారి. గతంలో స్టార్ అథ్లెట్లు మిల్కా సింగ్, కృష్ణా పూనియా, వికాస్ గౌడ్‌లు మాత్రమే వ్యక్తిగత స్వర్ణాలను గెలుచుకున్నారు.
శనివారం ఇప్పటివరకు భారత్ మొత్తం 6 పతకాలను సాధించింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, 2 రజతాలు ఉన్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో మేరీకోమ్... పురుషుల 52 కిలోల విభాగంలో గౌరవ్ సోలంకీ.... షూటింగ్‌లో సంజీవ్ రాజ్‌పుత్ స్వర్ణ పతకాలు సాధించారు.
పురుషుల బాక్సింగ్ 60 కేజీలో విభాగంలో కౌశిక్... పురుషుల బాక్సింగ్ 49 కిలోలో విభాగంలో అమిత్ రజత పతకాలను సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 21 స్వర్ణాలు, 13 రజతాలు, 14 కాంస్యాలు చేరాయి. ఇప్పటివరకు 21 స్వర్ణపతకాలు సాధించి.. 48 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది.