
హైదరాబాద్: ప్రియురాలి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికాకు చెందిన పారా ఒలింపిక్ అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్‌కు విధించిన జైలు శిక్షను 6 ఏళ్ల నుంచి 13 ఏళ్ల ఐదు నెలలకు పొడిగిస్తూ ఆ దేశ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పిస్టోరియస్ 2013లో ప్రేమికుల రోజు తెల్లవారుజామున తన ప్రేయసి రీవా స్టీన్ క్యాంప్‌పై కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో రీవా అక్కడిక్కడే మృతి చెందింది. అయితే.. అది హత్య కాదని, హత్యకు దారితీసిన పరిస్థితి (కల్పబుల్ హోమిసైడ్) అని జడ్జి భావించారు. ఈ కేసుకు సంబంధించి గతంలో అతడికి ఆరేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. ఈ మేరకు గతంలో దక్షిణాఫ్రికా జడ్జి తొకొజైల్ మసిపా తన తీర్పు వెలువరించారు.
ఈ తీర్పుతో ఇప్పటికే పిస్టోరియస్ కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే తాజాగా ఈ కేసులో వాదనలు విన్న దక్షిణాఫ్రికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువరించిన సమయంలో పిస్టోరియస్ కోర్టులో లేకపోవడం విశేషం. అయితే, తాను చేసిన పనికి పిస్టోరియస్ ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదంటూ ప్రాసిక్యూటర్లు చేసిన వాదనను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
మరోవైపు ఆస్కార్ పిస్టోరియస్ తాను చేసిన తప్పుకు తగు మూలం చెల్లించక తప్పదని హత్యకు గురైన రీవా స్టీన్‌క్యాంప్ తండ్రి బారీ స్టీన్ క్యాంప్ అన్నాడు. రీవా తండ్రి బారీ మాట్లాడుతూ పిస్టోరియస్‌ను తాను క్షమించలేనని, అతడిని కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నాడు.