
తప్పుకున్న కెనడా
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలంపిక్స్ పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అసలు ఒలింపిక్స్ నిర్వహిస్తారా లేదా అనే అనుమానం తలెత్తుతోంది. టోక్యో ఒలింపిక్స్ నుంచి కెనడా తప్పుకుంటున్నట్లు కెనడా ఒలింపిక్ కమిటీ మరియు పారాలింపిక్ కమిటీలు తేల్చి చెప్పారు. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ రెండు కమిటీలు వివరణ ఇచ్చాయి. ఇక గడిచిన 48 గంటల్లో ఒలింపిక్స్ నిర్వహించరాదనే స్వరం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలంటూ పలు దేశాల నుంచి డిమాండ్ వస్తోంది. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో వాయిదా వేయడమే మంచిదని పలు దేశాల ఒలింపిక్ సంఘాలు సూచిస్తున్నాయి.

వాయిదా వేయాలంటూ పలు దేశాల అభ్యర్థన
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 13వేల మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు. కెనడా ఒలింపిక్ కమిటీ, కెనడా పారాలింపిక్ కమిటీలు ఒలింపిక్స్ ను వాయిదా వేయాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి సూచించింది. అంతేకాదు ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా ఈ క్రీడలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒక ఏడాది పాటు వాయిదా వేయాలని పరిస్థితులు చక్కబడ్డాక నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అదే సమయంలో క్రీడలను వాయిదా వేయడం వల్ల ఎదురయ్యే అన్ని ఇబ్బందుల్లో తాము అండగా నిలుస్తామని కెనడా చెబుతోంది. క్రీడలను వాయిదా వేయడమే ఉత్తమమని కెనడా ఒలింపిక్స్ సంఘం చెబుతోంది. ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని వెల్లడించింది.

త్వరగా ఒక నిర్ణయం వెల్లడించాలన్న జపాన్ ప్రధాని
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎప్పుడూ ఒలింపిక్స్ వాయిదా పడిన చరిత్ర లేదు. ఎలాంటి కష్ట సమయాలు ఎదురైనప్పటికి కూడా ఈ క్రీడలను నిర్వహించారు. అయితే వాయిదా వేద్దామనుకుంటున్న అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం నిర్ణయానికి పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. మరోవైపు ఒలింపిక్స్ నిర్వహణపై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని జపాన్ ప్రధాని షింజో అబే అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీని కోరారు. పూర్తి స్థాయిలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించకుంటే వాయిదా వేయడమే మంచిదని ఆయన సూచించారు. అయితే నిర్ణయం తీసుకునేందుకు మరో నెలరోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 2021 ఒలింపిక్స్‌కు సన్నద్ధం కావాలని ఆస్ట్రేలియా ఒలింపిక్ సంఘం తమ క్రీడాకారులకు చెబుతోంది. ఒలింపిక్ క్రీడలు ఇక జరగవనేది స్పష్టమవుతోందని ఆస్ట్రేలియా ఒలింపిక్స్ సంఘం చెబుతోంది.


Click it and Unblock the Notifications












