విశాఖపట్నం: చాముండీశ్వరీనాథ్ పై ఆంధ్ర క్రికెట్ సంఘం (ఎసిఎ) అధ్యక్ష కార్యదర్శులు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కుట్రకు సంబంధించి ఎసిఎ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఉపాధ్యక్షుడు నారాయణ స్వామిల మధ్య జరిగిన సంభాషణల సీడీని ఒక తెలుగు టీవీ చానెల్ ప్రసారం చేసింది. లైంగిక వేధింపులు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై చాముండీశ్వరీనాథ్ ను ఎసిఎ కార్యదర్శి పదవి నుంచి తప్పించింది.
చాముండీశ్వరీనాథ్ ను శారీరకంగా, మానసికంగా దెబ్బ తీయాలని గంగరాజు, నారాయణస్వామిలు కుట్ర చేశారని టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. అంతకు ముందు తనపై వచ్చిన ఆరోపణలను చాముండీశ్వరీ నాథ్ వివిధ తెలుగు టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. తనను తప్పించడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.