క్రీడల్లోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుందని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ ఆరోపించారు. ఒలింపిక్స్‌కు ఎక్కువ సంఖ్యలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి క్రీడాకారులు అర్హత సాధిస్తుంటే, క్రీడా శాఖ నిధులు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, గుజరాత్‌కు వెచ్చిస్తున్నారని పర్గత్ సింగ్ అన్నారు.
''పారిస్ ఒలింపిక్స్‌కు 48 మంది అథ్లెట్లను పంపిన పంజాబ్, హర్యానాకు వరుసగా రూ.78 కోట్లు, రూ. 66 కోట్లు ఇచ్చారు. మరోవైపు కేవలం తొమ్మిది మంది అథ్లెట్లనే పంపిన యూపీ, గుజరాత్‌కు రూ.438 కోట్లు, రూ. 425 కోట్లు ఇచ్చారు. ఇది పక్షపాత పంపిణీ కాదా? రాష్ట్రాల పట్ల ఈ వివక్షను బీజేపీ ఇంకెత కాలం కొనసాగిస్తుంది?'' అని పర్గాత్ సింగ్ ట్వీట్ చేశారు. దీనికి ఖేలో ఇండియాకు రాష్ట్రాల పంపిణీ చేసిన నిధుల వివరాలను జోడించారు.

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగారు. ఇందులో హర్యానా నుంచి 24 మంది, పంజాబ్ నుంచి 19 మంది అథ్లెట్లు విశ్వక్రీడలకు ఎంపికయ్యారు. అంతేగాక ఈ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్, కాంస్య పతక విజేత సబర్‌జోత్ సింగ్ కూడా హర్యానాకు చెందినవాళ్లే.
మరోవైపు గుజరాత్ నుంచి ఇద్దరు, ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురు మాత్రమే పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. కానీ నిధుల్లో మాత్రం సింహభాగం యూపీ, గుజరాత్‌కు దక్కుతున్నాయని పర్గత్ సింగ్ మండిపడుతున్నారు. కాగా, ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించారు. అత్యధికంగా ప్రాజెక్ట్ ఖేలో ఇండియాకు రూ.900 కోట్లు కేటాయించారు.
మొత్తంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి క్రీడలకు బడ్జెట్‌లో స్వల్ప పెరుగుదల కనిపించింది.. వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్ ముగియనుండటం, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలకు మరో రెండేళ్ల పాటు సమయం ఉండటంతో రూ.45.36 కోట్లు మాత్రమే అదనంగా కేటాయించారు. గ్రామీణస్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఖేలో ఇండియా'కు గతంలో కంటే రూ.20 కోట్లు పెంచారు.