
హైదరాబాద్: దోహా వేదికగా జరిగిన ఖతార్ ఇంటర్నేషనల్ కప్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్ లిప్టర్ మీరాబాయి చాను సత్తా చాటింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో బరిలో దిగిన ఆమె 194 (83+111) కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించింది.
మొదట స్నాచ్‌లో 83 కేజీలు ఎత్తిన చాను క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలను ఎత్తింది. ఫ్రాన్స్‌కు చెందిన అనీస్ మిషెల్ (172 కేజీలు), మానోన్ లొరెన్జ్ (165 కేజీలు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. ఈ ఏడాది థాయ్‌లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి ఎత్తిన 201 కేజీలు ఎత్తి అత్యుత్తమ ప్రదర్శన చేసింది.
అయితే, ఇక్కడ దానికంటే 7 కేజీలు తక్కువే ఎత్తింది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ సిల్వర్ లెవల్ ఈవెంట్ అయిన ఈ టోర్నీలో మీరాబాయి స్వర్ణం సాధించడంతో 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతకు కీలకంగా మారింది. ఇక, పురుషుల విభాగంలో జెరేమీ లాల్‌రినుంగా (67 కేజీలు) రజతం దక్కించుకున్నాడు.
306 కేజీల (స్నాచ్‌లో 140, క్లీన్ అండ్ జెర్క్‌లో 166 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఇప్పటికే ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లలో ఒకటైన 'ఈగట్ కప్'లో చాను స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. 2018 నవంబర్ నుంచి 2020 ఏప్రిల్ మధ్య జరిగే మూడు దశల పోటీల్లో కనీసం ఒక టోర్నీలో పాల్గొన్న లిఫ్టర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించనున్నారు.