
కామన్వెల్త్ గేమ్స్ 2022లో 7వ రోజు భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. లేట్ నైట్ జరిగిన ఈవెంట్లో ఈ పతకాలొచ్చాయి. ఇందులో ఓ స్వర్ణం, ఓ రజతం ఉండడం విశేషం. మెన్స్ హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో ఈవెంట్లో సుధీర్ గోల్డ్ మెడల్ సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఇది భారత్‌కు తొలి పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం. పారా పవర్ లిఫ్టింగ్ అంటే వెయిట్ లిఫ్టింగ్ తరహా గేమే. అయితే ఇందులో పారా అథ్లెట్లు మాత్రమే పాల్గొంటారు. ఈ ఈవెంట్లో తొలిసారి భారత్‌కు స్వర్ణం రావడంతో భారత పారా కంటింజెంట్, కోచింగ్ స్టాఫ్ సంబరాల్లో మునిగితేలారు. తాజా స్వర్ణంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇండియాకు ఆరో గోల్డ్ మెడల్ వచ్చింది. భారత్ ఆరు గోల్డ్, ఏడు సిల్వర్, ఏడు బ్రాంజ్ పతకాలతో మొత్తం 20పతకాలు సాధించి.. మెడల్స్ లిస్టులో ఏడో ర్యాంకులో కొనసాగుతోంది.
ఇకపోతే 2018లో ఆసియా పారా గేమ్స్‌లో సుధీర్ కాంస్య పతకాన్ని సాధించి ప్రస్తుతం గోల్డ్ మెడల్ సాధించే స్థాయిలో శిక్షణ పొందడం గమనార్హం. కామన్ వెల్త్ గేమ్స్ తొలి రౌండ్లోనే 280కేజీల బరువు ఎత్తి శభాష్ అనిపించాడు. 212కిలోలకు పెంచి రెండో ప్రయత్నంలో 134.5పాయింట్లు సాధించి రికార్డును నెలకొల్పాడు. హరియాణాలోని సోనిపట్‌లోని సుధీర్ ఓ సాధారణ వ్యవసాయం కుటుంబానికి చెందినవాడు. నాలుగేళ్లప్పుడే విధి వక్రీకరించడంతో పోలియో బారిన పడి అంగవైకల్యానికి గురయ్యాడు. అయినా అతను చలించిపోలేదు. క్రీడలపై మక్కువ పెంచుకుని అకుంఠిత సాధన జరిపేవాడు.
అలా అతని క్రీడా ప్రస్థానం 2013లో మొదలయింది. పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్‌ను ఎంచుకుని అందులో రాణించడం మొదలెట్టాడు. 2016లో తొలిసారి నేషనల్ ఛాంపియన్‌గా నిలిచాడు. 2018లో ఆసియా పారా గేమ్స్‌కు ఎంపికయ్యాడు. ఆ ఈవెంట్లో భారత్‌కు కాంస్యాన్ని అందించి తన అంతర్జాతీయ కెరీర్‌ను మెడల్‌తో మొదలెట్టాడు. 2018లో 17వ సీనియర్, 12వ జూనియర్ నేషనల్ పారా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లలో కూడా స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎంపికయ్యాడు.