Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామన్ వెల్త్ క్రీడల ప్రారంభోత్సవం: మెరిసిన భారత్

Suresh Kalmadi
న్యూఢిల్లీ: ఆటంకాలు, ఆరోపణలు, విమర్శలను అధిగమించి,సందేహాలను పటాపంచలు చేస్తూ 2010 కామన్వెల్త్ గేమ్స్ ఆదివారం ఘనంగా ఆరంభమయ్యాయి. వీక్షకులను మైమరిపింపచేస్తూ మూడుగంటలపాటు కన్నులపండువగా జరిగిన ప్రారంభోత్సవ వేడుకలకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూస్టేడి యం వేదికగా నిలిచింది. మొత్తం 7,500 మంది భద్రతా సిబ్బంది డేగ కళ్లతో పహరా కాస్తుండగా, దాదాపు 60,000 మంది ప్రేక్షక సందోహం చూస్తుండగా, భారత రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్ సుశీల్ కుమార్ క్వీన్స్ బ్యాటన్‌ను విశిష్ట అతిథి ప్రిన్స్ చార్లెస్‌కు అందించాడు. క్వీన్ ఎలిజబెత్ సందేశాన్ని చదివి వినిపించిన చార్లెస్, 19వ కామన్వెల్త్ గేమ్స్‌ను ప్రారంభించగా, అనంతరం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 'లెట్ ద గేమ్ బిగిన్' అని లాంఛనంగా ప్రకటించారు.

కళ్లు మిరుమిట్లుగొలిపే బాణాసంచా కాంతులు ఢిల్లీ వినువీధుల్ని వర్ణభరితం చేయగా, మనోరంజక నృత్య, గాన ప్రదర్శనలు వీక్షకులను మరోలోకంలో విహరింపజేశాయి. క్రీడాకారుల మార్చ్‌పాస్ట్‌లో తొలుత ఆస్ట్రేలియా జట్టు, చివరిగా ఆతిథ్య భారత్ మైదానంలోకి అడుగుపెట్టాయి. భారత త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించిన ఏస్ షూటర్ అభినవ్ బింద్రా ఆటగాళ్ల తరపున క్రీడాప్రతిజ్ఞ చేశాడు. మొత్తం 71 దేశాల అథ్లెట్లు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్‌కు భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఆమె భర్త దేవీసింగ్, ప్రధాని మన్మోహ న్ సింగ్, ఆయన భార్య గురుచరణ్ కౌర్‌తో జంటగా విచ్చేశారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. వీఐపీ ఎన్‌క్లోజర్‌లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, క్రీడల నిర్వాహక కమిటీ చైర్మన్ సురేశ్ కల్మాడీలు ఆసీనులై కనిపించారు.

కాగా విదేశీ అతిథుల హోదాలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నషీద్, మొనాకో యువరాజు ఆల్బర్ట్, న్యూజిలాండ్ గవర్నర్ సర్ ఆనంద్ సత్యానంద్‌లు విచ్చేశారు. ఇక ఈ ప్రతిష్టాత్మక క్రీడోత్సవానికి మరింత రాచరిక సొబగులద్దుతూ ప్రిన్స్ చార్లెస్ తన అర్థాంగి కెమిల్లా పార్కర్ బౌల్స్‌తో వచ్చారు. ప్రపంచ క్రీడలను శాసించే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం చీఫ్ జాక్వెస్ రొగే, క్రీడల సమాఖ్య అధ్యక్షుడు మైక్ ఫెన్నెల్ ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కు వచ్చిన వారిలో ఉన్నారు. ఇక చివరగా స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ తాను రూపొందించిన 'జియో, ఉఠో, బఢో, జీతో (బతుకు, ఎదుగు, ముందుకు సాగు, విజయం సాధించు) అన్న కామన్వెల్త్ థీమ్ సాంగ్‌తో పాటు 'ఆస్కార్' గీతం జయహోను మధురంగా ఆలపించి ఆరంభ వేడుకలకు ముగింపు పలికాడు.

అతిథులను ఆహ్వానిస్తూ సాగే స్వాగత కార్యక్రమం ప్రఖ్యాత గాయకుడు హరిహరన్ నేతృత్వంలో సాగింది. హిందూస్తానీ, కర్ణాటక సంగీతాలను స్పృశిస్తూ మొదలైన ఈ గేయం, ఖవ్వాలీ శైలిలో ముగియడం విశేషం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మొత్తం 40 నిమిషాల పాటు జరిగిన క్లాసికల్ డ్యాన్స్ ఈవెంట్లో భారత కళాకారులు అచ్చెరువొందించే ప్రదర్శనతో అహూతులను అలరించారు. భరత నాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, మోహినీ అట్టం నృత్యశైలులను నయనమనోహరంగా అభినయించారు. ఈ వేడుకల్లో ఏడేళ్ల బాలమేధావి కేశవ్ తబలా ప్రదర్శన వీక్షకుల మదిని దోచుకుంది. పాండిచ్చేరినుంచి వచ్చిన ఈ చిన్నారి 'రిథమ్స్ ఆఫ్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా తన ప్రతిభతో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రిన్స్ చార్లెస్‌లతో పాటు అందరినీ మంత్రముగ్దులను చేశాడు. ఈ కార్యక్రమం ఆద్యంతం భారత సుసంపన్న సంస్కృతి, సంప్రదాయాలను వీక్షకుల కళ్ల ముందు ఆవిష్కరించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+