ముంబయి: శ్రీలంకతో భారత్ తన మూడో టెస్టు మ్యాచ్ ను కోచ్ గ్యారీ కిర్సస్టన్ లేకుండానే ఆడనుంది. తీవ్రమైన అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్ మన్ కిర్సస్టన్ వెళ్తున్నారు. ఇందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఆయనకు సెలవు ఇచ్చింది. ఈ విషయాన్ని బిసిసిఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కిర్సస్టన్ స్థానంలో మరొకరిని నియమించడం లేదని బిసిసిఐ తెలిపింది. రెండో టెస్టు మ్యాచును గెలవడంతో భారత్ సిరీస్ ను సమం చేసింది. తొలి టెస్టులో శ్రీలంక భారత్ పై విజయం సాధించింది. కీలకమైన మూడో టెస్టు ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు జరుగుతుంది.