
హైదరాబాద్: ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని కామన్వెల్త్ గేమ్స్ విజేతలు శనివారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.

5 రాష్ర్టాలకు చెందిన 18 మంది క్రీడాకారులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారని క్రీడాకారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఏప్రిల్ 23న కామన్వెల్త్ విజేతలకు ఎల్బీ స్టేడియంలో సన్మానం, అభినందన సభ నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన వారిలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సిక్కీరెడ్డి తదితరులు ఉన్నారు.