హైదరాబాద్: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత ఇప్పటి వరకు ఓటమంటూ ఎరగని విజేందర్ సింగ్ తన ప్రత్యర్థిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబైలో ఆగస్టు 5న జరిగే బిగ్‌ఫైట్‌లో తన చైనా ప్రత్యర్థి జుల్ఫికర్ మైమైతియాలిని 45 సెకన్లలో ఓడిస్తానని అన్నాడు.
ఈ ఫైట్‌పై సోమవారం మీడియాతో మాట్లాడిన విజేందర్ చైనా వస్తువులతో బాక్సర్ జుల్ఫికర్‌కు సరిపోల్చాడు. చైనా వస్తువులు ఎక్కువ కాలం మన్నవని, తాను కూడా 45 సెకన్లలో మ్యాచ్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తానని స్పష్టంచేశాడు.

'ప్రత్యర్థిని 45 సెకన్లలో ఓడించేందుకు ప్రయత్నిస్తా. ఎందుకంటే చైనా ఉత్పత్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉండవు మరి' అని విజేందర్ అన్నాడు. విజేందర్ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ కాగా, జుల్ఫికర్ ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్.
డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ విజేందర్ గెలుపోటముల రికార్డు 8-0గా ఉండగా, డబ్ల్యూబీవో ఓరియెంటల్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ జుల్ఫికర్ మైమైతియాలి నెంబర్ వన్ బాక్సరే. ఇద్దరూ ప్రొఫెషనల్ బాక్సర్లుగా మారిన తర్వాత ఓడిపోలేదు.
దీంతో వీరిద్దరూ తలపడే పోరుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు బౌట్‌కు ముందే అతనిపై మానసికంగా పైచేయి సాధించడానికి విజేందర్ మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరూ ఈ బౌట్‌లో తమ టైటిల్స్‌ను పణంగా పెట్టి తలపడనున్నారు. గెలిచిన వాళ్లకు రెండు టైటిల్స్ దక్కనున్నాయి.