
బ్రిటన్ ఫార్ములావన్ స్టార్ లూయిస్ హామిల్టన్ ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో చాంపియన్‌గా నిలిచాడు. తాజా విజయంతో హామిల్టన్ తన కెరీర్‌లో ఆరోసారి చైనీస్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కు ఇది వరుసగా రెండో విజయం.
ఆదివారం జరిగిన 56 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 32 నిమిషాల 06.350 సెకన్లలో ముగించి మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. పోల్ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం పొందాడు. ప్రధాన రేసు మొదలైన వెంటనే తొలి మలుపులోనే బొటాస్‌ను ఓవర్‌టేక్ చేసిన హామిల్టన్.. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కొనసాగించాడు. ఇక ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది.
మొత్తం 20 మంది డ్రైవర్లు రేసులో పాల్గొనగా.. ముగ్గురు డ్రైవర్లు లాండో నోరిస్ (మెక్‌లారెన్), డానిల్ క్వియాట్ (ఎస్టీఆర్), హుల్కెన్‌బర్గ్ (రెనౌ) రేసు ముగించకుండానే మధ్యలో వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరగనుంది.