ప్రధాని మోదీని కలవడం కోసం..డిఫెండింగ్ టైటిల్‌ను వదిలేసి!
చెస్ ఒలింపియాడ్‌లో పసిడి సాధించిన భారత పురుషుల, మహిళల జట్లను ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత పెంచిన గ్రాండ్ మాస్టర్లను మోదీ అభినందించారు. వాళ్ల ప్రదర్శనను కొనియాడారు. చనువుగా మాట్లాడుతూ సరదగా ముచ్చటించారు. తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానందలతో కలిసి ప్రధాని గేమ్ కూడా ఆడారు.
విజయంలో కీలక పాత్ర పోషించిన దొమ్మరాజు గుకేశ్‌ను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతిలతో సరదాగా మాట్లాడారు. మహిళా గ్రాండ్ మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్‌దేవ్‌లను మోదీ ప్రశంసించారు. అయితే ప్రధాని మోదీని కలవడం కోసం విదిత్ ఓ టోర్నమెంట్ నుంచి వైదొలగడం గమనార్హం.

వుగర్ గషిమోవ్ స్మారక చెస్ టోర్నమెంట్లో పోటీపడేందుకు విదిత్ బాకు (అజర్‌బైజాన్) వెళ్లాడు. ఈ టోర్నీలో అతను డిఫెండింగ్ ఛాంపియన్. టైటిల్‌ను తిరిగి సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ చెస్ ఒలింపియాడ్ ఛాంపియన్లను ప్రధాని మోదీ సన్నానిస్తున్నారని తెలిసి వెంటనే స్వదేశానికి చేరుకున్నాడు. ఆ టోర్నీలో విదిత్ స్థానంలో అరవింద్ ఆడనున్నాడు.
బుడాపెస్ట్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రెండు స్వర్ణాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. భారత పురుషుల జట్టులో విదిత్ సభ్యుడు. కాగా, ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. అంతకుముందు 2014, 2022లో పురుషుల జట్లు, 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలవడమే అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణపతకాలు నెగ్గిన భారత జట్లకు అఖిల భారత చెస్ సమాఖ్య రూ.3 కోట్ల 20 లక్షల నగదు బహుమతి ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications