ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ జోరు కొనసాగిస్తోంది. రెండో రౌండ్‌లోనూ భారత పురుషుల, మహిళల జట్లు అలవోకగా విజయాలు సాధించాయి. గురువారం ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 4-0తో ఘన విజయం సాధించింది. దొమ్మరాజు గుకేశ్ 40 ఎత్తుల్లో వాట్‌నర్ స్టెఫాన్సస్‌పై గెలవగా, అర్జున్ ఇరిగేశి 38 ఎత్తుల్లో హాన్స్ స్టెఫాన్సస్‌పై సత్తాచాటాడు.
విదిత్ 38 ఎత్తుల్లో హెమిసన్ ఫ్రెయర్‌పై పైచేయి సాధించాడు. ఇక సుదీర్ఘంగా సాగిన పోరులో హెల్గీ గ్రేటర్సన్‌పై పెంటేల హరికృష్ణ 58 ఎత్తుల్లో గెలిచాడు.మరోవైపు మహిళల విభాగంలో చెక్ రిపబ్లిక్‌పై భారత జట్టు 3.5-0.5 తేడాతో విజయం సాధించింది. భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్ విజయాలను అందుకోగా తానియా సచ్‌దేవ్ తన గేమ్ డ్రాగా ముగించింది.

ద్రోణవల్లి హారిక 41 ఎత్తుల్లో జూలియాపై పైచేయి సాధించింది. దివ్య దేశ్‌ముఖ్ 41 ఎత్తుల్లో నటాలీ కొనాకోవాపై నెగ్గింది. వంతిక అగర్వాల్ 31 ఎత్తుల్లో తెరెజా ఆట కట్టించింది. కొరెనోవాతో జరిగిన గేమ్‌ను తానియా సచ్‌దేవ్ 35 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. కాగా, మొదటి రౌండ్‌లో భారత పురుషుల జట్టు మొరాకోపై, మహిళల జట్టు జమైకాపై గెలిచిన సంగతి తెలిసిందే.
మొరాకోను మనోళ్లు 4-0తో చిత్తు చేశారు. అర్జున్ ఇరిగేసి- జాక్వెస్ ఎల్బిలాపై, పెంటేల హరికృష్ణ-అనాస్ మొయాద్‌ని, ప్రజ్ఞానంద-మహ్మద్ తిసిర్‌పై, విదిత్ గుజ్‌రాతీ-మెహ్దీపై నెగ్గారు. మహిళల జట్టు జమైకాపై 3.5-0.5తో గెలిచింది. వైశాలి - క్లార్క్ అడానిపై, తానియా సచ్‌దేవ్ -గాబ్రియేలా వాట్సన్‌పై, దివ్య దేశ్‌ముఖ్ - రాచెల్ మిల్లర్‌పై విజయం సాధించారు. రెహానా బ్రౌన్‌తో జరిగిన గేమ్‌ను వంతిక అగర్వాల్ డ్రా చేసుకుంది.