చెన్నై: చెన్నై టెస్ట్‌లో పిచ్ నుంచి ఎలాంటి సహాకారం లభించకపోవడంతో భారత బౌలర్లకు వికెట్లు రావడం గగనమై పోయింది. దీంతో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి 331 పరుగులు చేసింది. నీల్ మెకంజీ 155 పరుగులు చేసి నాటవుటుగా మిగిలాడు. ఆమ్లా 81 పరుగులు చేయగా మిగతా బ్యాట్స్ మెన్ లో కల్లీస్ 19, ప్రిన్స్ 5, డీవిలియర్స్ 11 పరుగులు చేశారు. బౌటర్ 11 పరుగులతో నాటవుటుగా మిగిలాడు. తొలి ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్ హర్భజన్ రెండో ఇన్నింగ్సులో మూడు వికెట్లు తీశాడు. కుంబ్లే, సెహ్వాగ్ చెరో వికెట్ తీశారు.
ఓవర్‌నైట్ స్కోరు ఓ వికెట్ నష్టానికి 131 పరుగులతో చివరిరోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా నిలకడైన బ్యాటింగ్‌తో కొనసాగింది. అంతకుముందు నాలుగోరోజు భారత్ 627 పరుగులకు ఆలౌట్ అవ్వడం ద్వారా తన తొలి ఇన్నింగ్స్ ముగించింది. దీంతో భారత్‌కు 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అటుపై రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా శనివారం ఆట ముగింపు సమయానికి ఓ వికెట్ నష్టానికి 131 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మిత్ (35) వికెట్‌ను హర్బజన్ దక్కించుకున్నాడు. ఈ టెస్ట్ ప్రారంభంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.