చెన్నై: చెస్ ఆటలోనే కాదు, మంచి పని చేయడంలోనూ ముందుంటానని చాటి చెప్పాడు చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ఇటీవల చెన్నైలో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సినీ, పారిశ్రామిక ప్రముఖులు నిరాశ్రయులైన చెన్నై ప్రజలకు అండగా నిలిచారు. విశ్వనాథన్ ఆనంద్ కూడా వారికి తనవంతుగా సాయం చేసి మంచి మనసును చాటుకున్నారు. చెన్నైలో ఆనంద్ కుటుంబం నివసిస్తున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందరో నిరుపేదలు భారీ వర్షాలు, వరదలతో తమకున్న కాస్తనీడను సైతం కోల్పోయి రోడ్డున పడ్డారు.
నిరాశ్రయులైన సుమారు 20మందికిపైగా వరద బాధితులకు విశ్వనాథన్ ఆనంద్ తన ఇంట్లోనే బస ఏర్పాటు చేశారు. వారిలో ఆనంద్ ఇంట్లో మనిషితోపాటు ఇద్దరు గర్భిణి మహిళలు కూడా ఉన్నారు.

విశ్వనాథన్ ఆనంద్ కుటుంబం వారందరికీ భోజనం పెట్టి బాగా చూసుకున్నారు. కాగా, ఆ ఇంటికి వచ్చిన పిల్లలు కొందరు, తాము పుస్తకాల్లో చదువుకున్న ఆనంద్ ఇంటికి వచ్చామని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారట.
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమ సమీపంలోని ప్రజలకు సాయం చేయాలని అనుకున్నామని, అందుకే నిరాశ్రయులైన వారికి తమ ఇంట్లోనే బస ఏర్పాటు చేశామని ఆనంద్ భార్య అరుణ చెప్పారు. వారికి భోజనం కూడా తమ ఇంట్లోనే వండి పెట్టామని తెలిపారు.