చెన్నై: ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) తిరిగి దక్కించుకోవాలని చెన్నైయిన్ ఎఫ్‌సి జట్టు తహతహలాడుతోంది. ఇప్పటివరకు ఇటలీకి చెందిన పెరుగియా క్యాంప్‌లో ప్రీ సీజన్ మ్యాచ్‌లు ఆడి పునరుత్తేజితులైన చెన్నైయిన్ కుర్రాళ్లు మరో వారంలోగా ప్రారంభమయ్యే టోర్నీ కోసం సంసిద్ధులయ్యారు. ఇటలీలో ప్రీ సీజన్ మ్యాచ్‌లు ముగించుకుని చెన్నైకి చేరుకున్న క్రీడాకారుల తొలి బ్యాచ్‌కు స్థానికులు ప్రత్యేకించి ఫుట్‌బాల్ ప్రేమికులు ఉత్తేజపూరిత స్వాగతం పలికారు.
చెన్నై విమానాశ్రయంలో తమ అభిమాన క్రీడాకారులకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టారు.జెండాలు ప్రదర్శించారు. చెన్నైయిన్ ఆటగాళ్లు విమానాశ్రయం నుంచి బయటకు రాగానే అభిమానుల కేరింతలతో పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. అభిమానుల ఉత్సాహంతో ఆటగాళ్లు ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
ఈ సందర్భంగా చెన్నైయిన్ ఎఫ్‌సి సారథి, 2015 నుంచి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీజీ లాల్‌పెఖులా మాట్లాడుతూ 'మేం ఐఎస్‌ఎల్‌లో ఉత్తమ మద్దతుదారులుగా నిలిచినందునే మా పట్ల సూపర్‌మాచన్స్ మరోసారి వారికున్న అభిమానం చాటుకున్నారు.గత ఏడాది వారు అందించిన సహకారం, ప్రోత్సాహం వల్లే మేం టైటిల్ గెలుచుకోగలిగాం. ఈ ఏడాది కూడా చెన్నైకి ట్రోఫీ గెలుచుకొచ్చి వారిని సంతోష పెట్టాలని మేము కోరుకుంటున్నాం' అని చెప్పాడు.

చెన్నైయిన్ ఎఫ్‌సి జట్టులో కొత్తగా చేరిన స్థానికుడు నల్లప్పన్ మోహన్‌రాజ్ మాట్లాడుతూ 'చెన్నైయిన్ ఎఫ్‌సి ఫ్రాంచైసీ జట్టు తరఫున ఆడాలన్న నా కల నిజమైంది. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. విదేశాల్లో ప్రీ సీజన్ సెషన్ ముగించుకుని సొంత గడ్డపై అడుగు పెట్టిన నా అపురూపమైన అభిమానుల నుంచి అద్భుతమైన స్వాగతం లభించింది. చాలా అనుకూల వాతావరణంలో మా ప్రీ సీజన్ ముగిసింది. మా అభిమానుల సమక్షంలో మరీనా బీచ్‌లో ఆడేందుకు వేచిచూస్తున్నాం' అని అన్నాడు.
కొత్తగా చేరిన మరో క్రీడాకారుడు దుబు మాట్లాడుతూ ' ఇంతకుముందు చెన్నైయిన్ ఎఫ్‌సి జట్టుకు అభిమానుల నుంచి చాలా గొప్ప మద్దతు లభించేదని నేను విన్నా. ఇప్పుడు అది నాకు అనుభవపూర్వకంగా నిజమని తెలిసింది. భారీ సంఖ్యలో మాకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా, వారితో కలిసి ఎంజాయ్‌చేసేందుకు ఎంతమాత్రం వేచి చూడను' అని అన్నారు.
జట్టు హెడ్ కోచ్ మార్కొ మాటెరాజ్జి, అతని ఇటాలియన్ కోచింగ్ స్టాఫ్, ఇతర విదేశీ క్రీడాకారులు సోమవారం చెన్నైకి చేరుకుంటారు. ఐఎస్‌ఎల్ మూడో సీజన్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సి జట్టు అక్టోబర్ రెండో తేదీన అట్లెంటికో డీ కోల్‌కతాతో ఢీ కొడుతుంది. సొంత జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అక్టోబర్ ఆరోతేదీన ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సితో తలపడుతుంది.
జవహర్‌లాల్ స్టేడియంలో జరగే ఏడు హోం మ్యాచ్‌ల టిక్కెట్లు ఐదు కేటగిరీల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నారు. రూ.150, రూ.200, రూ.250, రూ.300, రూ.500 రకాలుగా టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఆసక్తి కలవారు 'బుక్‌మైషో డాట్ కాం/ చెన్నైయిన్ ఎఫ్‌సిలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.చెన్నైయిన్ ఎఫ్‌సి జట్టులో 18 మంది భారత్, ముగ్గురు విదేశీయులు సభ్యులు. విదేశీయుల్లో బ్రెజిల్ ఆటగాళ్లు ఎడెర్ మొంటేరియో, ఈలీ సబియా, నైజిరియాకు చెందిన దుదు ఒమాంగ్‌బేమీ ఉన్నారు.