న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో ఆమె సాధించిన విజయాలకు గుర్తింపుగా అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ) మేరీకోమ్‌ను 'లెజెండ్స్ అవార్డ్'తో సత్కరించనుంది. ఈ మేరకు ఏఐబీఏ అధికారిక ప్రకటన చేసింది.
ఏఐబీఏ 70వ వార్షికోత్సవాల సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన జరిగే కార్యక్రమంలో మేరీకోమ్‌కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేయనున్నారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కూడా మేరీ కోమ్ కొనసాగుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ఏఐబీఏ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మేరీకోమ్ వ్యవహరించింది. 'ఈ గౌరవం లభించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. నాతో పాటు దేశంలోని యువ బాక్సర్లకు ఇది స్ఫూర్తినిస్తుంది' అని మేరీకోమ్ సంతోషం వ్యక్తం చేసింది.