
బెంగళూరు: ఆర్మీకి చెందిన హవిల్దార్ అనుజ్ కుమార్ తాలియన్ సోమవారం దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో జరిగిన 11వ ప్రపంచ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2019లో స్వర్ణం సాధించాడు. హవిల్దార్ కుమార్ 100+ కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు. భారత్ చేరుకున్న అనుజ్ కుమార్‌కు బుధవారం మద్రాస్ ఇంజనీర్ గ్రూపుకు చెందిన ఇండియన్ ఆర్మీ ఘన స్వాగతం పలికింది.
అనంతరం ప్రభాస్ నటించిన 'బాహుబలి' చిత్రంలోని 'సహోర్ బాహుబలి' పాటతో ఆర్మీ జీపులో అనుజ్ కుమార్‌ను ఊరేగించారు. ఈ సమయంలో అనుజ్ తనదైన స్టయిల్లో పోజులు ఇచ్చాడు. అతనికి సైన్యం అభినందనలు తెలిపింది. బెంగళూరు డిఫెన్స్ ప్రో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. హవిల్దార్ కుమార్ 2010లో మద్రాస్ సప్పర్స్ లో చేరాడు. మార్చిలో పూణేలో జరిగిన సీనియర్ నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2018 సందర్భంగా 100+ కేజీల విభాగంలో స్వర్ణం సాధించాడు.
ఆ తరువాత 2018 సర్వీసెస్ ఛాంపియన్‌షిప్‌లో రెండు జాతీయ బంగారు పతక టైటిళ్లను గెలుచుకున్నాడు. ఆ సంవత్సరం సర్వీసెస్ ఛాంపియన్‌గా కూడా అవతరించాడు. మార్చి 29 నుంచి 31 వరకు చెన్నైలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో 2019లో హవిల్దార్ కుమార్ మళ్లీ బంగారు పతక విజేతగా నిలిచాడు.
ప్రపంచ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున తొలిసారి మిస్టర్ యూనివర్స్ టైటిల్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు చిత్రేష్ నటేశన్. ఈ 33 ఏళ్ల కండలవీరుడి స్వస్థలం కేరళ కాగా.. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉండి సాధన చేస్తున్నాడు. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీల పురుషుల వ్యక్తిగత విభాగాల్లో 38 దేశాల నుంచి 50 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. ఇందులో 90 కిలోల విభాగంలో నటేశన్ ప్రథమ స్థానంలో నిలిచి టైటిల్ దక్కించుకున్నాడు.