
హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అథ్లెట్, జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ మంగళవారం (ఆగస్టు 21) 32వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఉసేన్ బోల్ట్‌కు సోషల్ మీడియాలో పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తన కెరీర్‌లో ఉసేన్ బోల్ట్ అనేక ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఒలింపిక్స్‌లో ఎనిమిదిసార్లు బంగారు పతకాలను సాధించి ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్‌గా ఉసేన్ బోల్ట్ నిలిచిన సంగతి తెలిసిందే.
2017లో లండన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్‌షిప్ అనంతరం ఉసేన్ బోల్ట్ అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యాడు. బోల్ట్ చివరిసారిగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల స్ప్రింట్ విభాగంలో పోటీ పడ్డాడు. అయితే, తన కెరీర్ చివరి రేసులో మాత్రం చిన్నబోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలిచాడు.
తన కెరీర్‌లో చివరి 100 మీటర్ల రేసులో తొలిసారి కాంస్యానికే పరిమితమయ్యాడు. కాంస్య తొలిసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా, ఉసేన్ బోల్ట్ చివరి పరుగు కోసం ప్రఖ్యాత షూ కంపెనీ 'ప్యుమా' బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ సరికొత్త బూట్లను తయారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ రెండు బూట్లు కూడా విభిన్న రంగుల్లో ఉండటం విశేషం. ఒక బూటు పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది బోల్ట్ చిన్నప్పుడు ఓనమాలు నేర్చుకున్న 'విలియం నిబ్ హైస్కూల్'కు సంబంధించిన కలర్. దీనిపై ఫరెవర్ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది.
ఇది ముగింపునకు నిదర్శనమని 'ప్యుమా' సంస్థ తెలిపింది. అథ్లెటిక్స్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఉసేన్ బోల్ట్ పుట్‌బాల్ ప్లేయర్‌గా రాణిస్తున్నాడు. ఇందులో భాగంగా సెంట్రల్ కోస్ట్ మెరైనర్స్‌కు చెందిన 'ఏ-లీగర్స్ పుట్‌బాల్ క్లబ్' తో బోల్ట్ ఒప్పందం చేసుకున్నాడు.