ముంబై: క్రీడాతారల జీవితకథల ఆధారంగా తీసిన చిత్రాలు ఘన విజయాలు సాధిస్తుండడంతో ఈ తరహా చిత్రాలపై బాలీవుడ్ అమితాసక్తి కనబరుస్తోంది. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత చరిత్ర కూడా తెరకెక్కనుంది. అజారుద్దీన్ పాత్రలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ నటించనున్నాడు.
ఈ విషయాన్ని ఇమ్రాన్ హష్మీనే చెప్పాడు. 'చిత్ర కథను రూపొందించడం కోసం అజార్ భాయ్‌తో మాట్లాడాల్సి ఉంది. క్రీడాకారునిగా అజారుద్దీన్ జీవితం ప్రత్యేకమైంది. సినిమాలో ప్రధానాంశం క్రికెటే అయినా, అజార్ జీవితానికి సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉంటాయి' అని హష్మీ చెప్పాడు.
రెండున్నర గంటల్లో అజ్జూ భాయ్ జీవితాన్ని చూపించడం నిజంగా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అందుకు ఎంతో ప్రణాళిక బద్ధంగా వ్యవహారించాల్సి ఉంటుందన్నాడు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించనున్నాడు.

ప్రస్తుతం ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని చెప్పిన ఇమ్రాన్.. నమ్మకం, చిత్తశుద్ధితో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లు ఇమ్రాన్ తెలిపాడు. విజయానికి బాక్స్ ఆఫీస్ ఒక్కటే బెంచ్ మార్క్ కాదని చెప్పాడు. అందరిలా కాకుండా తాను కొంచెం భిన్నంగా ఆలోచిస్తానని, సినిమా ఫ్లాప్ అయినా తాను బాధ పడనని చెప్పాడు. ప్రస్తుతం ఒడిదుడుకుల సినీ జీవితాన్ని సారిస్తున్న ఇమ్రాన్.. అజార్ చిత్రంతోనైనా గాడిలో పడుతుందని నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.
మిథాలీ సేనదే ఏకైక టీ20
బెంగళూరు: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఓటమికి భారత మహిళల జట్టు టీ20 గెలుపుతో బదులు తీర్చుకుంది. ఆదివారం జరిగిన ఏకైక టీ20లో మిథాలీసేన 16 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. తొలుత భారత జట్టు.. స్మృతి (52), కెప్టెన్ మిథాలీ(40)లు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5వికెట్లకు 146 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో సఫారీలు.. 9 వికెట్లకు 130 పరుగులే చేశారు.