హైదరాబాద్: ప్రపంచ బిలియర్డ్స్ మాజీ ఛాంపియన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత మైఖేల్ ఫెరారీని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట వేలకోట్లు వసూలు చేసిన క్యూనెట్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న మైఖేల్ ఫెరారీ (78)ని ముంబై పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్యూనెట్ మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో వేల రూపాయలను వసూలు చేసిన కేసులో ఆయనకు భాగస్వామ్యం ఉందని ఎంతో కాలం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే క్యూనెట్ సంస్థ మోసం చేసిందని ఎనిమిది మంది బాధితులు హైదరాబాద్ ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో ఆయనకు ఇప్పటికే పోలీసులు పలుసార్లు నోటీసులు జారీ చేశారు. మైఖేలె ఫెరారీతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్యూనెట్ సంస్ధకు చెందిన డైరెక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయనతో పాటు మాగరాల బాలాజీ, వంకా శ్రీనివాస్, మాల్కం దేశాయ్‌లను పీటీ వారెంట్‌పై ముంబై నుంచి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
క్యూనెట్ సంస్ధ పేరిట వీరు వేలకోట్ల రూపాయలను వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా క్యూనెట్ సంస్ధ పిరమిడ్ బిజినెస్ మోడల్‌లో వేల మందికి ఈ కామర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ, బోగస్ పథకాల పేరుతో లక్షల్లో మోసం చేసిందని ఈ సంస్థపై పలు కేసులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ సంస్ధ ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీఎస్, బంజారాహిల్స్ పీఎస్, ఎస్‌ఆర్‌నగర్ పీఎస్, మాదాపూర్ పీఎస్‌ల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఇక మైఖేల్ ఫెరారీ అంతర్జాతీయ స్నూకర్ ప్లేయర్. నాలుగుసార్లు అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ నెగ్గారు. భారత ప్రభుత్వం మైఖేల్‌ను పద్మ భూషన్ అవార్డుతో కూడా సత్కరించింది.