భారత ఆర్చర్ భజన్ కౌర్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో క్వాలిఫై అయ్యింది. ఫైనల్ క్వాలిఫయింగ్ టోర్నీలో స్వర్ణం సాధించి ఈ ఘనత అందుకుంది. ఆదివారం ఇరాన్ క్రీడాకారిణి మొబినాతో జరిగిన తుదిపోరులో భజన్ కౌర్ 6-2 (28-26, 29-29, 29-26, 29-29)తో విజయఢంకా మోగించింది.
ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో అర్హత సాధించిన భారత రెండో ఆర్చర్‌గా భజన్ ఘనత సాధించింది. పురుషుల రికర్వ్ సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ ఇప్పటికే బెర్తు సాధించిన విషయం తెలిసిందే. ధీరజ్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందినవారు. కాగా, ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మిక్స్‌డ్ విభాగంలోనూ పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది.

మరోవైపు భారత ఆర్చర్లు అంకిత భాకత్, దీపిక కుమారి నిరాశపరిచారు. మొబినా చేతిలో అంకిత పోరాడి ఓడింది. 4-6 (27-27, 27-28, 29-27, 27-27, 28-29)తో పరాజయాన్ని చవిచూసింది. ఇక స్టార్ ఆర్చర్ దీపిక కుమారి అజర్‌బైజాన్ క్రీడాకారిణి యెలాగుల్ రమజనోవా చేతిలో ఓటమిపాలైంది. నేరుగా మూడో రౌండ్ మ్యాచ్ ఆడిన దీపిక కుమారి 4-6 (28-26, 27-25, 23-26, 24-25, 27-29)తో ఓడింది.
కాగా, టీమ్ విభాగాల్లో భారత ఆర్చరీ జట్టు అర్హత సాధించలేకపోయింది. మెక్సికోతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 4-5తో ఓటమిపాలైంది. మరోవైపు భారత మహిళల జట్టులో ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. ఉక్రెయిన్‌తో జరిగిన పోరులో 3-5తో ఓటమి చవిచూసింది. అయితే ర్యాంకింగ్‌ను బట్టి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం భారత జట్లకు ఇంకా ఉంది.