వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి అవుట్!
సుదీర్ఘ న్యాయపోరాటం గెలిచి ఆసియా క్రీడల ట్రయల్స్ బరిలోకి దిగిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు ఊహించని బిగ్ షాక్ తగిలింది. శనివారం (మే 30) ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఆసియా క్రీడల ట్రయల్స్‌లో ఆమె ఓటమి పాలయ్యారు. మహిళల 53 కిలోల విభాగం సెమీఫైనల్స్ ముఖాముఖి పోరులో యువ రెజ్లర్ మీనాక్షి గోయల్ చేతిలో వినేష్ ఫోగట్ 6-4 తేడాతో పరాజయం పాలైంది. ఈ ఘోర ఓటమితో ఆసియా క్రీడలు-2026 బరిలో నిలిచి.. దేశానికి మరో పతకం అందించాలనే వినేష్ ఫోగట్ కల ముక్కలైంది.
ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యువ రెజ్లర్ మీనాక్షి గోయల్ మొదటి నుంచే వినేష్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అత్యంత దూకుడుగా ఆడుతూ వినేష్ ఫోగట్‌కు ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు సాధించింది. వినేష్ ఫోగట్ తన సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్‌లోకి తిరిగి రావడానికి గట్టిగానే ప్రయత్నించినప్పటికీ.. ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించిన మీనాక్షి చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ 6-4తో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచిన మీనాక్షి గోయల్.. ఇప్పుడు వినేష్ వంటి దిగ్గజాన్ని ఓడించి భారత మహిళల కుస్తీలో సరికొత్త తరం దూసుకువస్తోందని నిరూపించింది.

అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటమి చవిచూసిన వెంటనే వినేష్ ఫోగట్ తీవ్ర నిరాశతో మ్యాట్ వెలుపలికి వెళ్లినప్పటికీ.. కొద్ది క్షణాల్లోనే మళ్లీ వెనక్కి తిరిగొచ్చారు. అక్కడ ఉన్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ వైపు నేరుగా వేలు చూపిస్తూ, బిగ్గరగా "నేను మళ్లీ బలంగా తిరిగి వస్తాను" అంటూ గట్టిగా సవాలు విసిరారు. వినేష్‌కు సంబంధించిన ఈ పవర్‌ఫుల్ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తానింకా ఓటమిని ఒప్పుకోలేదని, భవిష్యత్తులో గట్టి పునరాగమనం చేస్తానని ఆమె ఈ సంకేతం ద్వారా స్పష్టం చేశారు.
నిజానికి ఈ ట్రయల్స్‌లో వినేష్ ఫోగట్ పాల్గొనడం వెనుక పెద్ద హైడ్రామానే నడిచింది. ఆమెను ట్రయల్స్‌కు రానివ్వకుండా డబ్ల్యూఎఫ్ఐ తీవ్రంగా అడ్డుకుంది. ఢిల్లీ హైకోర్టు వినేష్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రెజ్లింగ్ సమాఖ్య ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, సుప్రీంకోర్టు సైతం వినేష్ వైపే నిలబడటంతో ఆమెకు ఆఖరి నిమిషంలో ఆసియాడ్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో జరిగిన సీనియర్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో 57 కేజీల విభాగంలో ఆడాలని వినేష్ భావించినా అక్కడ కూడా WFI ఆమెకు అనుమతి నిరాకరించింది.
గత కొన్నేళ్లుగా ఆట కంటే ఎక్కువగా వివాదాలు, భారత రెజ్లింగ్ సమాఖ్యతో పోరాటాలు, న్యాయస్థానాల చుట్టూ తిరగడంతోనే వినేష్ ఫోగట్ సమయం గడిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో అనర్హతకు గురైన తర్వాత వినేష్ తీవ్ర మనస్తాపంతో రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ గతేడాది చివర్లోనే క్రీడల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఆశలతో కోర్టుల ద్వారా పోరాడి సాధించుకున్న ఈ ఆసియాడ్ అవకాశం, కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓటమితో చేజారిపోవడం వినేష్ ఫోగట్ కెరీర్‌లోనే ఒక అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications