ఆసియా గేమ్స్: మొత్తం 800 మంది, 36 క్రీడాంశాల్లో 572 మంది అథ్లెట్లు

హైదరాబాద్: మరో వారం రోజుల్లో ఆరంభం కానున్న ఆసియా గేమ్స్‌కు భారత బృందం సిద్ధమైంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్‌లో జరిగే ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 36 క్రీడాంశాల్లో 572 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.
ఈ జాబితా విషయంలో కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ ఉత్కంఠకు తెరదించిన మంత్రిత్వ శాఖ.. ఆసియా గేమ్స్‌లో పాల్గొనే బృందానికి శుక్రవారం రాత్రి ప్రత్యేక విందు కూడా ఇచ్చింది. అథ్లెట్లు, అధికారులతో కలిపి మొత్తం 800కు పైగా భారత బృందం ఆసియాడ్‌లో పాల్గొంటుందని మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి రాథోడ్ మాట్లాడుతూ క్రీడాగ్రామం లోపల, వెలుపల బాధ్యతాయుతంగా మసలుకోవాలని అథ్లెట్లకు సూచించారు. కామన్వెల్త్ క్రీడల సందర్భంగా మన అథ్లెట్లు బసచేసిన క్రీడాగ్రామం దగ్గర సిరంజిలు కనిపించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని, అథ్లెట్లంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు.
''దేశం తరఫున ఆసియా క్రీడల్లో పోటీ పడటం క్రీడాకారులకు గర్వకారణం. క్రీడల్లో పాల్గొనేటపుడు, క్రీడాగ్రామంలో ఉన్నపుడు మీ సొంత గుర్తింపంటూ ఏమీ ఉండదు. మీ అందరికీ ఉన్న ఒకే గుర్తింపు 'ఇండియా'. అది మీ అందరి మీదా ఉన్న పెద్ద బాధ్యత. మైదానం లోపల, బయట మీరేం చేస్తున్నా వంద కోట్ల భారతావనికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి మరిచిపోవద్దు. బాధ్యతో వ్యవహరించండి. క్రీడాకారులతో పాటు అధికారులు కూడా ఎల్లప్పుడూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి'' అని రాథోడ్ చెప్పాడు.

క్రీడాకారులు ఏళ్ల తరబడి కష్టపడతారు
‘‘పతకం గెలిచేందుకు క్రీడాకారులు ఏళ్ల తరబడి కష్టపడతారు. ఇప్పుడు ఆ అవకాశం ముందుంది. ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నది అథ్లెట్లకు నా సూచన. ఫలితాల గురించి మరీ ఎక్కువ ఆలోచించవద్దు. మీ సామర్థ్యాల్ని నమ్ముకుని ఆడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయి'' అని అన్నాడు. కాగా, ఆసియా గేమ్స్‌లో యువ జావెలిన్ త్రోయర్, కామన్వెల్త్ క్రీడల చాంపియన్ నీరజ్ చోప్రా మార్చ్‌పాస్ట్‌లో త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. 20 ఏళ్ల నీరజ్ చోప్రా గతేడాది ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో, 2016 లో అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు.

ఆ ఇద్దరు తమ ఖర్చులను వాళ్లే భరిస్తారు
ఇదిలా ఉంటే, ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్ల బృందంలో చెఫ్ డి మిషన్‌గా బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ను అతని డిప్యూటీగా రాజ్‌కుమార్ సచేటిని ఎంపిక చేయడంపై క్రీడాశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐవోఏ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ ఇద్దరూ తమ సొంత ఖర్చులతో అక్కడికి వెళుతున్నట్టు ప్రకటించింది. అంటే, భారత జట్టు వెంట వాళ్లున్నప్పటికీ, ఆ ఇద్దరు తమ ఖర్చులను వాళ్లే భరిస్తారని వెల్లడించింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసులో ఈ ఇద్దరిపై ఆరోపణలున్న నేపథ్యంలో వీళ్లను ఆసియా గేమ్స్‌కు ఐవోఏ ఎంపికచేయడాన్ని క్రీడాశాఖ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

ఆసియా గేమ్స్ మొదలైందే భారత్‌లోనే
ఆసియా గేమ్స్ మొదలైందే భారత్‌లోనే. 1951లో ఢిల్లీ వేదికగా ఈ క్రీడలను ప్రారంభమయ్యాయి. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ఈ పోటీలను ప్రారంభించారు. తొలి టోర్నీలో 15 స్వర్ణాలతో పాటు 51 పతకాలు గెలుచుకున్న భారత్ మొత్తం మీద పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అక్కడ నుంచి భారత ప్రదర్శన తగ్గిందే కానీ పెరగలేదు. 1962 జకార్తా క్రీడల్లో మూడో స్థానంలో నిలిచిన భారత్.. ఆ తర్వాత మళ్లీ మూడో స్థానానికి కూడా చేరలేకపోయింది. 1980 వరకు భారత్ టాప్-5లో స్థిరంగా నిలిచేది.

ఆసియా గేమ్స్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాలు 602
కానీ చైనా, కొరియాతో పాటు కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ లాంటి దేశాల్లో క్రీడల్లో ఎదగడంతో నెమ్మదిగా ఒక్కో ర్యాంకు పడిపోతూ వచ్చింది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో అయితే టాప్-10లోనూ భారత్ చోటు కోల్పోయింది. 2010 క్రీడల్లో 14 స్వర్ణాలతో ఆరో స్థానం సంపాదించిన భారత్... గత ఆసియా క్రీడల్లో మళ్లీ వెనకబడి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆసియా గేమ్స్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాలు 602. ఇందులో 139 స్వర్ణాలున్నాయి. వాటర్ పోలో లాంటి క్రీడలోనూ పసిడి గెలిచిన భారత్.. వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం గెలవలేకపోయింది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనడం భారత్‌కు ఇది పద్దెనిమిదోసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications