న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్ ఆసియా గేమ్స్‌కు వెళ్లిన భారత బృందంలోని ఒలింపిక్ బంగారు పతక విజేత మేరీ కోమ్‌కు అత్యుత్తమ క్రీడాకారిణి అవార్డు దక్కింది. సోమవారమిక్కడ జరిగిన సన్మాన కార్యక్రమంలో భారత బృందం స్పాన్సర్ శామ్‌సంగ్ ఓటింగ్ ద్వారా మేరీ కోమ్‌ను అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
ఆసియాడ్ మహిళల బాక్సింగ్ 51 కిలోల విభాగంలో మేరీ కోమ్ బంగారు పతకం సాధించి రికార్డు సృష్టించింది. ఈ అవార్డు కింద రూ. 10 లక్షలను బహూకరించారు. ఈ సందర్బంలో మేరీ కోమ్ మాట్లాడుతూ ఇంచియాన్ ఆసియా గేమ్స్‌లో తాను స్వర్ణం గెలవగలనా అని అందరూ సందేహించారని చెప్పింది.
"మన సమాజ పరిస్దితుల ప్రకారం ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యాక బాక్సింగ్ లాంటి క్రీడలో రాణించడం చాలా కష్టం. అందుకే ఆసియా గేమ్స్‌లో నేను స్వర్ణం గెలవగలనా అని చాలా మంది సందేహించారు. కానీ భావన తప్పని నేను నిరూపించాను" అని మేరీ కోమ్ పేర్కొంది.

ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైన టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులకు మంత్రి శర్బానంద సోనోవాల్ స్వర్ణ విజేతలకు రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 6 లక్షలు అందజేశారు. మిక్స్డ్‌డ్ డబుల్స్ సాకేత్‌తో కలిసి స్వర్ణం, డబుల్స్‌లో ప్రార్దన తోంబ్రేతో కలిసి కాంస్యం నెగ్గిన సానిమా మిర్జా రూ. 26 లక్షలు అందుకుంది.
సానియా మిర్జా మాట్లాడుతూ పతకం గెలవడం, ఇక్కడి వరకు చేరుకోవడం వెనుక అథ్లెట్ల శ్రమ ఎంతో ఉంటుందని అన్నారు. త్రివర్ణ పతకాన్ని పట్టుకోవడం, గేమ్స్‌లో జాతీయ గీతం వినిపించేలా చేయడం అథ్లెట్ల కల. దాన్ని సాధించడం మరింత గౌరవంగా ఉంటుందని పేర్కొంది.