
జకర్తా: ఇండోనేషియా వేదికగా 'ఆసియా గేమ్స్ 2018' టోర్నీ అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభమైంది. వేలాది మంది అథ్లెట్లు ఒకే గూటికి చేరిన వేళ ఇండోనేషియా వెలిగిపోయింది. కళాకారుల నృత్య ప్రదర్శనలతో పాటు లేజర్ షో అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈసారి ఆసియా క్రీడల బడ్జెట్టే రూ.34 వేల కోట్లని అంచనా. అలాంటి క్రీడల్లో లక్ష కోట్లకు పైగా సంపదకు అధిపతి అయిన క్రీడాకారుడు పోటీ పడుతుండటం విశేషం.
ఆ బిలియనీర్ పేరు బాంబాంగ్ హర్టానో. ఇండొనేషియాకు చెందిన హర్టానోకు పెద్ద ఎత్తున వ్యాపారాలున్నాయి. 78 ఏళ్ల హర్టానో బ్రిడ్జ్ క్రీడలో పోటీ పడుతున్నాడు. 'నాకు ఆరేళ్ల వయసుండగానే బ్రిడ్జ్ ఆడటం మొదలుపెట్టాను. 30 ఏళ్లకు కాంట్రాక్ట్ బ్రిడ్జ్ ఆడాను. ఇది తెలివితేటలకు పరీక్ష పెట్టే ఆట. నా జ్ఞాపకశక్తి పదిలంగా ఉండటం కోసం ఈ ఆట ఆడతాను' అని హర్టానో చెప్పాడు. అతడి మొత్తం ఆస్తి రూ.1.16 లక్షల కోట్లని అంచనా. ఈసారి క్రీడల్లో పాల్గొంటున్న అత్యంత ధనవంతుడు హర్టానోనే అని గణాంకాలే చెబుతున్నాయి.
బ్రిడ్జ్ క్రీడాకారుల్లో హర్టానో లాగే పెద్ద వయస్కులు చాలామందే ఉన్నారు. 70-79 ఏళ్ల మధ్య వయస్కులే 11 మంది ఉండటం విశేషం. ఫిలిప్పీన్స్‌కు చెందిన బ్రిడ్జ్ క్రీడాకారుడు కాంగ్ టె యాంగ్ వయసు 85 ఏళ్లు. ఈసారి క్రీడల్లో అత్యధిక వయస్కుడు అతనే. స్కేట్ బోర్డ్ క్రీడాకారుడైన అలిఖా (9 ఏళ్లు) అత్యంత పిన్న వయస్కుడిగా బరిలోకి దిగుతున్నాడు. స్టేడియంలో ఇరు వైపులా ఇండోనేషియా సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యం చేస్తున్న 5000 వేల మంది కళాకారులు.. డప్పుల మోతలు.. లేజర్ వెలుగుల మధ్య 18వ ఆసియా క్రీడలు అట్టహాసంగా మొదలయ్యాయి.
45 దేశాల నుంచి దాదాపు 13,000 వేల మంది అథ్లెట్లు మార్చ్‌పాస్ట్ చేస్తుండగా జకర్తాలోని గెలోర్ బంగ్ కర్నో ప్రధాన స్టేడియం వెలిగిపోయింది. టెర్రరిజం లాంటి సమస్యలున్నా.. భూకంపాల్లో చిక్కుకున్నా అతి పెద్ద క్రీడా సంబరాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండోనేషియా ఈ క్రీడల ప్రారంభోత్సవంలో తెలియజెప్పింది.