చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ రెండు రజతాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పోటీల్లో భారత అమ్మాయిల బృందం రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ ఖాతాలో వేసుకుంది. రమిత, మెహూలీ ఘోష్, ఆషి ఛోక్సీ బృందం ఈ పోటీల్లో సత్తా చాటింది. ఈ పోటీల్లో స్వర్ణం సాధించిన చైనా బృందానికి భారత బృందానికి కేవలం 10 పాయింట్లే తేడా ఉండటం గమనార్హం.
హాంగ్‌జో వేదికగా ఈ ఆసియా క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత బృందం 1886 పాయింట్లు సాధించింది. వీటిలో రమిత 631.9 పాయింట్లు సాధించగా.. మెహూలీ 630.8, ఆషి 623.3 పాయింట్లతో సత్తా చాటారు. అయితే చైనా బృందం ఓవరాల్‌గా 1896 పాయింట్లు సాధించి అగ్రస్థానం సాధించింది. దీంతో భారత్‌కు త్రుటిలో స్వర్ణం చేజారినట్లయింది.

రమిత, మెహూలీ, ఆషీ త్రయం కేవలం సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే కావడం గమనార్హం. ఇక ఇదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో జరిగిన పోటీలను మెహూలీ రెండో స్థానంలో, రమిత ఐదో స్థానంలో ముగించారు. తద్వారా వీళ్లిద్దరూ వ్యక్తిగత విభాగంలో కూడా ఫైనల్‌కు అర్హత సాధించారు. ఆషి ఈ పోటీల్లో 29వ స్థానంలో నిలిచింది.
అలాగే భారత రోవర్లు కూడా ఆసియా క్రీడల్లో సత్తా చాటారు. పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో అరుణ్ లాల్ జాట్, అర్వింద్ సింగ్ పోటీ పడ్డారు. వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శనతో రోయింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు ఈ విభాగంలో దక్కిన తొలి మెడల్ ఇదే కావడం గమనార్హం. గతంలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పోటీ పడిన రోవర్లు వీరిద్దరే కావడం గమనార్హం.