చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత జట్టు మరో రెండు స్వర్ణాలు నెగ్గింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ పోటీల్లో భారత బృందం స్వర్ణం సాధించింది. స్వప్నిల్ కుశాలే, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షోరాన్‌తో కూడిన బృందం 1769 పాయింట్లతో చెలరేగింది. ఈ బృందం స్వర్ణంతో మెరవడంతో ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
అదే సమయంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం ఈవెంట్‌లో కూడా భారత జట్టు మెడల్ సాధించింది. పాలక్ గులియా, ఈషా సింగ్, దివ్య తడిగోల్ సుబ్బరాజుతో కూడా భారత బృందం అద్భుతంగా రాణించింది. 1731-50x పాయింట్లు సాధించిన ఈ జట్టు రెండో స్థానంలో రేసు ముగించింది. దీంతో ఆ టీం సిల్వర్ మెడల్ అందుకుంది. అంతేకాదు పాలక్, ఈషా ఇద్దరూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో వ్యక్తిగత విభాగాల్లో కూడా ఫైనల్ చేరారు.

ఈ ఈవెంట్‌లో భారత షూటర్ పాలక్ అద్భుతంగా సత్తా చాటింది. మొత్తం 242.1 పాయింట్లు సాధించిన పాలక్ స్వర్ణ పతకం తన ఖాతాలో వేసుకుంది. ఇదే ఈవెంట్‌లో ఫైనల్ చేరిన ఈషా త్రుటిలో స్వర్ణం చేజార్చుకొని రెండో స్థానంలో నిలిచింది. ఆమె 239.7 పాయింట్లతో రజత పతకం సాధించింది. పాకిస్తాన్‌కు చెందిన కిష్మాలా తాలత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది.
ఇక భారత టెన్నిస్ స్టార్లు రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేనీ కూడా పతకంతో మెరిశాడు. పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్ చేరిన ఈ జోడీ.. చైనాకు చెందిన జేసన్ జంగ్, సు యు సో చేతిలో 4-6, 4-6 తేడాతో ఓడింది. దీంతో వీళ్లిద్దరూ కేవలం రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో పురుషుల 20 కిలోమీటర్ల నడక రేసులో భారత క్రీడాకారుడు వికాస్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇదే రేసు మహిళా విభాగంలో ప్రియాంక ఐదో స్థానంలో రేసు ముగించింది.