
జకర్తా : ఆసియా క్రీడల్లో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తొలి రోజు పోటీల్లో నిరాశ పరిచాడు. పురుషుల రెజ్లింగ్ 74 కేజీ ఫ్రీస్టైల్ విభాగంలో సుశీల్.. బెహ్రేన్‌కు చెందిన ఆడమ్ బటిరోవ్‌పై 3-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇలా సుశీల్ క్వాలిఫై రౌండ్లోనే వెనుదిరగాల్సి వచ్చింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సుశీల్.. ఈ ఓటమితో స్వర్ణ పతక పోటీ నుంచి వైదొలిగాడు.
సుశీల్ తొలుత 2-0తో లీడ్‌లో ఉన్నప్పటికీ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయాడు. బటిరోవ్ వెంటనే కోలుకొని 5-3తో తొలి బౌట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇందులో ఓటమి పాలైనప్పటికీ సుశీల్‌కు మరో అవకాశం ఉంది. ఒక వేళ ఆడమ్ బటిరోవ్ ఫైనల్‌కి చేరితే రెపిచేజ్ ద్వారా సుశీల్ కాంస్య పతకం కోసం పోటీ పడవచ్చు.
ఇదే రెజ్లింగ్ విభాగంలో 57 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో సందీప్ తోమర్ ఎనిమిది రౌండ్లలో తొలిదైన మొదటి రౌండ్‌ను టర్కీ దేశానికి చెందిన రుస్తుం నజారొవ్‌పై 12-8 ఆధిక్యంతో పూర్తి చేసుకున్నాడు.
అంతకుముందు భారత్‌కు ఆసియా క్రీడల్లో తొలి పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో అపూర్వి చండేలా, రవికుమార్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది.