
హైదరాబాద్: "ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచి తిరిగొస్తానని తన సోదరుడితో చెప్పింది. చెప్పినట్లే స్వర్ణం గెలిచింది" అని చెప్పారు రాహీ సర్నోబత్ తల్లి ప్రభ సర్నోబత్. బుధవారం జరిగిన మహిళల 25మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్‌లో ఈ 27 ఏళ్ల మహారాష్ట్ర షూటర్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
తద్వారా సుదీర్ఘ చరిత్ర కల్గిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది. రాహీ సర్నోబత్ స్వర్ణం సాధించిన అనంతరం ఆమె తల్లి ప్రభ స్వర్నోబత్ మీడియాతో మాట్లాడారు.
"పోటీల కోసం పాలెంబాంగ్ వెళ్లడానికి ముందు రాహీ తన సోదరుడితో స్వర్ణంతోనే తిరిగి వస్తాను అని చెప్పింది. ఆమె అన్నట్లుగానే స్వర్ణం గెలుచుకుంది. మోచేతి గాయం కారణంగా కొన్ని నెలల పాటు తను పిస్టల్‌నే పట్టుకోలేదు. గాయం నుంచి కోలుకున్న అనంతరం ఆసియా క్రీడల కోసం చాలా శ్రమించింది. గత ఏడాదితో పోల్చితే రాహీలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది" అని ఆమె చెప్పారు.
ఇదిలా ఉంటే ఏడో స్థానంతో ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించిన రాహి.. నాప్‌హస్వాన్ యాంగ్‌పీబూన్(థాయ్‌లాండ్)తో నువ్వానేనా అన్నట్లు తలపడింది. ఫైనల్లో ఇద్దరు 34 పాయింట్లతో సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు మళ్లీ రెండు రౌండ్లు నిర్వహించారు. ఇందులో థాయ్‌లాండ్ షూటర్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసిన సర్నోబత్ స్వర్ణ పతకాన్ని అందుకుంది.

ఈ ఆసియాడ్‌లో సౌరభ్ చౌధరి తర్వాత స్వర్ణం గెలిచిన రెండో షూటర్‌గా సర్నోబత్ నిలిచింది. మొత్తంగా సౌరభ్ చౌధరి, జస్పాల్ రానా, రణ్‌ధీర్‌సింగ్, జీతూరాయ్, రంజన్ సోధీ తర్వాత ఆసియా గేమ్స్‌లో స్వర్ణం దక్కించుకున్న ఆరో షూటర్ రికార్డును సర్నోబత్ అరుదైన ఘనత సాధించింది.
ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన రాహీకి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల నజరానాను ప్రకటించింది. ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిస్తే రూ.50లక్షలు, రజతం గెలిస్తే రూ.30లక్షలు, కాంస్యం గెలిస్తే రూ.20లక్షలు అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విటర్‌లో పేర్కొన్నారు.