
హైదరాబాద్: ఆసియా అతిపెద్ద క్రీడా సమరానికి తెరలేచింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని జిలోరా బుంగ్ కర్ణో స్టేడియంలో 5:30 గంటలకు 18వ ఆసియా గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన శనివారం ప్రారంభ వేడుకలు మాత్రమే జరుగుతాయి. ఆరంభ వేడుకలో భారత్ తరఫున జావెలిన్‌త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా త్రివర్ణ పతాకంతో కవాతు చేశాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు పోటీలు జరగనున్నాయి. ఆదివారం నుంచి పోటీలు మొదలవుతాయి. 45 దేశాల నుంచి 10 వేలకు మందిపైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో ఉన్నారు. భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీలకు సిద్ధమయ్యారు. వీరిలో 311 మంది పురుషులు, 260 మంది మహిళలు ఉన్నారు.
ఈసారి 'ఎనర్జీ ఆఫ్ ఆసియా'ని ఆసియా గేమ్స్ మోటోగా నిర్ధారించారు. దీంతో పాటు మస్కట్‌లుగా భిన్ భిన్, అటుంగ్, కాకాలను ప్రకటించారు. భారత బృందానికి పతాకధారిగా అథ్లెట్ నీరజ్ చోప్రా నేతృత్వం వహించనున్నాడు. ఆసియా క్రీడలకు ఈసారి మంచి సన్నద్ధతతో భారత్ వచ్చింది.
షూటింగ్, హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో మనకు పతకాలు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఆసియా గేమ్స్‌లో బ్రిడ్జ్ క్రీడలో బరిలో దిగనున్న 81 ఏళ్ల లీహంగ్ ఫాంగ్ అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. మరోవైపు 11 ఏళ్ల ఇయాన్ నుర్మెన్ అమ్రి (స్కేట్‌బోర్డర్) అతి చిన్నవయస్కుడిగా నిలిచాడు.
వీరిద్దరూ మలేసియాకు చెందినవారే కావడం విశేషం. ఇంచియాన్ (2014) ఆసియా క్రీడల్లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య 57గా ఉంది. అయితే, ఈసారి ఆ పతకాల సంఖ్యను భారత్ మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఆసియా గేమ్స్‌లో కబడ్డీలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది.
1990లో ఆసియా క్రీడల్లో కబడ్డీని ప్రవేశపెట్టగా.. అప్పటి నుంచి ప్రతిసారీ భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. 2010లో మహిళల కబడ్డీని క్రీడల్లో చేర్చారు. రెండు సార్లూ భారత జట్టే స్వర్ణం గెలవడం విశేషం. 1951 ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన స్వర్ణాలు 15.. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు ఇవే అత్యధికం.
చివరిగా 2010 క్రీడల్లో భారత్ 14 స్వర్ణ పతకాలు గెలిచింది. కానీ, ఈసారి ఇండోనేషియా క్రీడల్లో భారత్ రికార్డు స్వర్ణాలు గెలుస్తుందా లేదా అనేదే ఆసక్తికరం. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు అత్యధిక పతకాలు అందించిన అథ్లెటిక్స్ (233), రెజ్లింగ్ (56), బాక్సింగ్ (55), షూటింగ్ (49)పైనే ఈసారీ భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
హాకీ, కబడ్డీ, రెజ్లింగ్‌లతో పాటు టెన్నిస్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, టీటీ, అథ్లెటిక్స్‌లతో పతకాలు మెరుగ్గా వస్తాయని భారత్ ఆశిస్తోంది. భారత స్టార్ అథ్లెట్లు అంచనాలు అందుకుంటే ఈసారి 18 స్వర్ణాలు రావొచ్చని.. పతకాల సంఖ్య 80 వరకు దాటొచ్చని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.