
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించిన క్రీడాకారిణి ముస్కన్ కిరార్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.75లక్షల నజరానా ప్రకటించింది. మంగళవారం మహిళల కాంపౌండ్ ఈవెంట్లో భారత మహిళల ఆర్చరీ జట్టు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
చివరి షాట్ దాకా పోరాడిన జ్యోతి సురేఖ, మధుమిత, ముస్కన్ కిరార్‌లతో కూడిన భారత బృందం తృటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. 231- 228 పాయింట్ల తేడాతో ఓటమి పాలైన ఆర్చరీ జట్టు, రజత పతకంతో సరిపెట్టుకుంది. గోల్డ్ మెడల్ కోసం దక్షిణ కొరియాతో జరిగిన టీమ్ ఈవెంట్‌లో మొదటి సెట్‌లో భారత్ దూకుడుగా ఆడింది.

తొలి సెట్‌ను భారత్ 59-57 స్కోర్‌తో చేజిక్కించుకున్నది. అయితే రెండో సెట్‌లో అన్యూహ్యంగా పుంజుకున్న కొరియన్ టీం 58 పాయింట్లు సాధించారు. ఈ రౌండ్‌లో భారత మహిళలు 56 పాయింట్లకే పరిమితమయ్యారు. దాంతో ఇరు జట్ల స్కోరు సమం అయ్యాయి. మూడో సెట్‌లో ఇరు జట్లు 58, 58 పాయింట్లు సాధించడంతో రసవత్తరమైన పోటీ నెలకొంది.
నిర్ణయాత్మకమైన చివరి సెట్‌లో దక్షిణ కొరియా టీం 58 పాయింట్లు సాధించారు. దాంతో ఒత్తిడికి గురైన భారత మహిళలు 55 పాయింట్లకే పరిమితమై రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. రజతం గెలిచిన జట్టులో మధ్యప్రదేశ్‌కు చెందిన ముస్కన్ సభ్యురాలు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.75లక్షల నజరానా ప్రకటించింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ "ముస్కన్.. జబల్‌పూర్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి. ఆసియా గేమ్స్‌లో ఆమె సాధించిన పతకంతో రాష్ట్రంతో పాటు దేశం గర్వపడుతోంది. ఈ సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75లక్షల నజరానా అందజేయనుంది" అని ట్విట్టర్‌లో ప్రకటించారు.
మరోవైపు 4×400 మిక్స్‌డ్ రిలేలో రజతం సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ఆరోక్య రాజీవ్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.30 లక్షలు ప్రకటించింది.