

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జురుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో అంచనాలను నిజం చేస్తూ భారత అథ్లెట్ల జోరు కొనసాగింది. మంగళవారం కూడా అథ్లెటిక్స్ నుంచే భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. ఆఖరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకున్న భారత అథ్లెట్ మన్‌జీత్ పురుషుల 800 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు.
1 నిమిషం 46.15 సెకన్లలో అతను రేసు పూర్తి చేశాడు. ఇదే ఈవెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మరో భారత అథ్లెట్ జిన్సన్‌ను అతడు వెనక్కి నెట్టాడు. దీంతో జిన్సన్ జాన్సన్ (1ని. 46.35 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. అబూ బకర్ (ఖతార్-1ని. 46.38 సెకన్లు) కాంస్య పతకం అందుకున్నాడు.
1982 ఏషియాడ్ (చార్ల్స్ బొరోమియో) తర్వాత ఈ విభాగంలో స్వర్ణం సాధించిన భారత తొలి అథ్లెట్‌గా మన్‌జీత్ ఘనత సాధించాడు. ఇదే జకార్తాలో జరిగిన 1962 ఏషియాడ్‌లో దల్జీత్, అమ్రిత్ పాల్ రజత, కాంస్యాలు సాధించిన తర్వాత 800 మీటర్ల పరుగులో ఇద్దరు భారత అథ్లెట్లు పతకాలు నెగ్గడం కూడా ఇదే మొదటిసారి.
నిజానికి రేసు ఆరంభానికి ముందు మన్‌జీత్ సింగ్ కనీసం కాంస్యమైన సాధిస్తాడని కూడా ఎవరూ ఊహించలేదు. 800మీ పరుగులో అందరి దృష్టిలోనూ ఫేవరెట్ జిన్సన్ జాన్సనే. కానీ అద్భుత ప్రదర్శన చేసిన మన్‌జీత్(1 నిమిషం 46.15సె).. జిన్సన్ జాన్సన్‌ను రెండో స్థానానికి పరిమితం చేశాడు.
జిన్సన్ క్వాలిఫికేషన్ దశలో అందరికన్నా అత్యుత్తమ టైమింగ్(1:47.39)ను నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఫైనల్లో జిన్సనే అందరి ఫేవరెట్. ఫైనల్ రేసులో జిన్సన్ ముందు వరుసలో ఉండగా మంజీత్ మాత్రం ఎక్కడో వెనుక ఉన్నాడు. తొలి ల్యాప్ 60 సెకన్లలోపే పూర్తయింది. అప్పటికే మన్‌జీత్ బాగా వెనుకబడే ఉన్నాడు.
రెండో ల్యాప్ నుంచి మంజీత్ వేగం పెంచాడు. వేగంగా పరిగెత్తుకుంటూ ముందున్న వాళ్లను అందుకున్నాడు. చివరి 100 మీటర్లు సమీపిస్తుండగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంజీత్ మరింత వేగంగా పరుగెత్తాడు. అందరినీ దాటేస్తూ 800 మీటర్ల విజేతగా నిలిచాడు.