
హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న 18వ ఆసియా గేమ్స్‌కు సర్వం సిద్ధమైంది. ఆసియా క్రీడలు శనివారం (ఆగస్టు 18)న రాజధాని జకార్తాలోని GBK ప్రధాన స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. మొత్తం 16 రోజుల పాటు క్రీడాభిమానులను ఆసియా గేమ్స్ అలరించనున్నాయి.
ఏషియాడ్‌ను ఆసియాలో జరిగే ఒలింపిక్స్ గేమ్స్‌గా అభివర్ణిస్తారు. ఈ క్రీడా సంరంభానికి హాజరవుతోన్న 11వేల మంది అథ్లెట్లు, 5వేల మంది అధికారులకు జకర్తా, పాలెంబాగ్‌లు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక గేమ్స్ కోసం ఆతిధ్య నగరాలు జకార్తా, పాలెంబాగ్‌లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రెండో సారి ఆసియా గేమ్స్‌కు ఇండోనేషియా ఆతిధ్యమిస్తోంది. 1962లో తొలిసారిగా ఇండోనేసియా ఆసియా గేమ్స్‌కు ఆతిధ్యమిచ్చింది. 56 ఏళ్ల తర్వాత మళ్లీ ఆసియా గేమ్స్‌కు ఆతిధ్యమిచ్చే అవకాశాన్ని ఇండోనేషియా దక్కించుకుంది. 1951లో తొలిసారిగా ఆసియా గేమ్స్ ఆరంభమయ్యాయి.
అప్పటి నుంచి ఇప్పటివరకు 17 సార్లు ఈ ప్రతిష్టాత్మక గేమ్స్ నిర్వహించగా తొలి ఆసియా గేమ్స్‌కు ఆతిధ్యమిచ్చింది మాత్రం భారత్‌దే. ఢిల్లీ వేదికగా తొలి ఆసియా గేమ్స్ పోటీలు జరిగాయి. ఆసియా గేమ్స్‌లో జపాన్, చైనాలదే పైచేయి. ఇక, పతకాల పట్టిక విషయానికి వస్తే మాత్రం చైనాదే అగ్రస్థానం.
ఆ తర్వాతి స్థానంలో జపాన్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ 6వ స్థానంలో ఉంది. చైనా మొత్తంగా 2895 పతకాలతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ 616 పతకాలతో 6వ స్థానంలో నిలిచింది. 1982 నుంచి 2014 వరకూ వరుసగా 9 సార్లు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చైనా ఈసారి కూడా అగ్రస్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.