
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా భారత్ ఖాతాలోకి మరో పతకం వచ్చి చేరింది. శుక‍్రవారం జరిగిన స్క్వాష్ పురుషుల సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 2-0తేడాతో హాకాంగ్ జట్టు చేతిలో ఓటమి పాలైంది.
సౌరభ్ ఘోశల్, హరీందర్ పాల్ సింగ్ సంధూ, రమిత్ లాండన్, మహేశ్ మంగోంకర్‌లతో కూడిన భారత పురుషుల స్క్వాష్ జట్టు హాంకాంగ్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కూడా ఓడిపోయింది. సౌరవ్ గోషల్ 7-11, 9-11, 11-13 తేడాతో మొదటి మ్యాచ్ ఓడిపోగా, హరీందర్ పాల్ సంధు కూడా వరుస సెట్స్‌లో ఓడిపోయాడు. దీంతో కాంస్య పతకంలో సరిపెట్టుకుంది.
కాంస్యం సాధించిన స్క్వాష్ జట్టుని కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ అభినందించారు. "టోర్నమెంట్ మొత్తం మంచి ప్రదర్శన కనిబరిచింది స్క్వాష్ టీం. సౌరవ్ గోషల్, హరిందర్ పాల్ సందు, రమిత్ టంగన్, మహేష్ మంగావ్‌కర్‌లకు అభినందనలు. గ్రేట్ టీం వర్క్" అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు స్క్వాష్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప‍్రవేశించిన సంగతి తెలిసిందే.శుక‍్రవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2-0 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాను ఓడించి ఫైనల్‌కు చేరింది.
జోష్న చిన్నప్ప, దీపికా పల్లికల్, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నాతో కూడిన భారత మహిళల స్క్వాష్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిక్యాన్నికనబరిచిన భారత మహిళల స్వ్కాష్ జట్టు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.
దీంతో భారత మహిళల స్క్వాష్ జట్టు కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే స్వర్ణ పోరులో హాంకాంగ్ లేదా జపాన్‌ల మధ్య జరుగనున్న రెండో సెమీ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. మరోవైపు శుక్రవారం భారత పురుషుల జట్టు స్క్వాష్ సెమీ ఫైనల్‌లో హాంకాంగ్‌తో ఆడనుంది.