
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆసియా గేమ్స్‌లోనే టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత పురుషుల జట్టు చరిత్రాత్మక గెలుపుతో సరికొత్త రికార్డుని సృష్టించింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్, హర్మీత్ దేశాయ్,ఆంథోనీ అమల్‌రాజ్‌లతో కూడిన భారత జట్టు 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జపాన్‌పై సంచలన విజయం సాధించింది. 1958 ఆసియా గేమ్స్ నుంచి ఇప్పటివరకు టేబుల్ టెన్నిస్‌లో భారత్ ఒక్క పతకం కూడా నెగ్గలేదు.
దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ ఏకంగా సెమీఫైనల్స్‌కు చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్స్ తొలి మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11-9, 11-9, 11-7తేడాతో యుడా జిన్‌పై నెగ్గి శుభారంభం అందించగా... రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 11-8, 12-10, 11-8తేడాతో మసుదైరా కెంటాను ఓడించి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.
ఇక, మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 11-9, 12-14, 11-8, 8-11, 4-11తేడాతో యొషిడా మసాకి చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే నాలుగో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 12-10, 6-11, 11-7, 11-4తేడాతో కెంటాను ఓడించి భారత్‌ను సెమీస్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.
మంగళవారం జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్, చైనీస్ తైపీతో చైనా తలపడనున్నాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు కాంస్యాలు లభిస్తాయి. మరోవైపు భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 1-3తేడాతో హాంకాంగ్ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.