
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం జరిగిన పోట్లీలో స్వర్ణ పతకం లభించకపోయినప్పటికీ... రజత పతకాల మోత మోగించింది. ఏకంగా ఐదు రజతాలతో అదరగొట్టింది. వీటన్నింటిలోకి ద్యుతి చంద్ ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
పురుష హర్మోన్లు అధికంగా ఉన్నాయన్న కేసు కారణంగా గత ఆసియా గేమ్స్‌లో పోటీపడలేకపోయిన ద్యుతి చంద్ ఈసారి తొలి ప్రయత్నంలోనే తన పతక కలను సాకారం చేసుకుంది. 100 మీటర్ల రేసులో భారత్‌కు రజత పతకం అందించింది. ఆసియా గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల రేసులో 20 ఏళ్ల తర్వాత భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.
ఈ ఈవెంట్‌లో భారత్ చివరి పతకాన్ని 1998 క్రీడల్లో రచిత మిస్త్రీ గెలిచింది. ఆమె కాంస్యం చేజిక్కించుకుంది. ఇక ద్యుతి.. పీటీ ఉష (1986) తర్వాత ఆసియా క్రీడల మహిళల 100మీలో రజతం సాధించిన భారత అథ్లెట్‌గా కూడా అరుదైన ఘనత సాధించింది. ఇక, 400మీ పరుగులో రెండు రజతాలతో భారత్ సత్తా చాటింది.
తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ మహిళల 400మీ పరుగులో హిమ దాస్ రజతం సాధించింది. రెండు రోజుల్లో హిమకు ఇది రెండో జాతీయ రికార్డు. బహ్రెయిన్‌కు చెందిన సల్వార్ నాజర్ 50.09 సెకన్లతో స్వర్ణం నెగ్గగా.. 50.59 సెకన్లతో హిమ రెండో స్థానంలో నిలిచింది. ఇక పురుషుల విభాగంలో మహ్మద్ అనాస్ మరో రజత పతకం సాధించాడు.
ఇదిలా ఉంటే, ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన 'బ్రిడ్జ్' క్రీడలో భారత్ రెండు పతకాలు లభించాయి. భారత పురుషుల, మిక్స్‌డ్ టీమ్‌లు సెమీఫైనల్ చేరుకోవడంతో కనీసం రెండు పతకాలు మన ఖాతాలో చేరాయి. పురుషుల, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నాయి.
జగ్గీ శివ్‌దాసని, రాజేశ్వర్ తివారి, అజయ్ ఖారె, రాజు, దేబబ్రత మజుందార్, సుమిత్ ముఖర్జీలతో కూడిన భారత పురుషుల జట్టు సింగపూర్ చేతిలో ఓడిపోయింది. కిరణ్ నాడార్, హేమ దేవరా, హిమాని, బాచిరాజు సత్యనారాయణ, గోపీనాథ్ మన్నా, రాజీవ్‌లతో కూడిన భారత మిక్స్‌డ్ జట్టు సెమీస్‌లో థాయ్‌లాండ్ చేతిలో ఓడిపోయింది.
సెమీస్‌లో ఓడినా భారత్ కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. అంతకముందు 13 క్వాలిఫికేషన్ రౌండ్లు ముగిసిన తర్వాత పురుషుల బ్రిడ్జ్ జట్టు నాలుగో స్థానంలో నిలవగా, మిక్స్‌డ్ విభాగంలో 7 క్వాలిఫయింగ్ రౌండ్ల అనంతరం మన జట్టు అగ్రస్థానం సాధించింది.