
హైదరాబాద్: ఆసియా గేమ్స్‌లో పలువురు క్రీడాకారులు పతకాలు సాధిస్తుంటే, మరికొందరు తమ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నారు. ఈ గేమ్స్‌లో కచ్చితంగా పతకం తెస్తుందని ఆశపడ్డ భారత ఆర్చర్ దీపికా కుమారి క్వార్టర్స్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
ఆర్చరీ మహిళల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్‌లో తీవ్రంగా నిరాశపర్చిన దీపికా కుమారి, క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే ఇంటి దారి పట్టడం విశేషం. చివరి షాట్‌లో పది పాయింట్లు సాధించాల్సిన సమయంలో కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో మొత్తం 28 పాయింట్లతో దీపికా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆసియా గేమ్స్‌కు ముందు జరిగిన ఆర్చరీ వరల్డ్‌కప్‌లో దీపికా స్వర్ణం సాధించింది. దాంతో ఆసియా గేమ్స్‌లోనూ దీపికా పతకం సాధిస్తుందని అందరూ భావించారు. అయితే, పోటీల్లో కనీసం క్వార్టర్స్ కూడా చేరకుండానే దీపికా కుమారి నిష్కమించింది.
ఇక, పురుషల విభాగంలో బరిలో దిగిన అతాను దాస్ కూడా క్వార్టర్స్‌లో ఓడిపోయాడు. ఇండోనేషియా ఆర్చర్ రియూ ఎగా అగట సల్సా బిల్లాతో పోటీపడిన అతాను దాస్ క్వార్టర్ ఫైనల్లో 3-7 పాయింట్లతో ఓడి, పోటీ నుంచి నిష్కమించాడు.
వీరితో పాటు పతకం తెస్తారనుకున్న భారత జిమ్నాస్ట్‌లు బుద్ధారెడ్డి అరుణ, ప్రణతి నాయక్ కూడా వాల్డ్ ఫైనల్లో ఓడారు. జిమ్నాస్టిక్స్‌లో బుద్దా అరుణారెడ్డి (12.775 పాయింట్లు) విఫలమైంది. మహిళల వాల్ట్ ఫైనల్ ఈవెంట్‌లో బరిలోకి దిగిన ఆమె ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.
మరో భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్‌కు (12.650 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానం దక్కింది. మరోవైపు మహిళల డబుల్ స్కల్స్‌లోనూ భారత జోడి రాజేంద్ర, పూజ చివరి స్థానంలో నిలిచారు. వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 77 కిలోలో విభాగంలో అజయ్ సింగ్ ఐదో స్థానంలో నిలిచాడు.
మరో భారత వెయిట్ లిఫ్టర్ సతీశ్ శివలింగం 77 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్ట్ చేయబోతూ గాయపడ్డాడు.