
జకార్తా: అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరగబోయే ఆసియా గేమ్స్‌లో గెలవబోయే పతకాలన్నింటినీ ఆయనకు అంకితమివ్వనున్నారు. ఈ మేరకు ఆసియా గేమ్స్ సీడీఎం బ్రిజ్ భూషణ్ శరణ్ శుక్రవారం స్పష్టం చేశారు.
18వ ఆసియా గేమ్స్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఇండోనేషియా వేదికగా శనివారమే ఈవెంట్ ప్రారంభం కానుంది. 45 దేశాల నుంచి 10 వేలకు మందిపైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో ఉన్నారు. భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీలకు సిద్ధమయ్యారు.
వీరిలో 311 మంది పురుషులు, 260 మంది మహిళలు ఉన్నారు. తొలిరోజైన శనివారం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆదివారం నుంచి పోటీలు మొదలవుతాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు సాధించిన అన్ని పతకాలను అటల్‌జీకి అంకితమివ్వాలని నిర్ణయించుకున్నాం. దేశం గర్వించదగ్గ వ్యక్తికి ఇదే మేమిచ్చే నివాళి" అని అన్నారు.
భారతీయ అథ్లెట్లందరూ అక్కడ వాజ్‌పేయీకి నివాళులర్పిస్తున్న ఫొటోను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. ఆసియా గేమ్స్‌లో భాగంగా భారతీయ అథ్లెట్లు, కోచ్‌లు ఇప్పటికే జకార్తా చేరుకున్నారు. షూటింగ్, హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో మనకు పతకాలు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.