హైదరాబాద్: ఇటీవల భువనేశ్వర్ వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల షాట్‌పుట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. ఆమె నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్టు డోప్ పరీక్షలో తేలింది.
ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ సందర్భంగా జూన్ 1 నుంచి 4వ తేదీ వరకు పాటియాలాలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో మన్‌ప్రీత్ డోపీగా తేలింది. నిషేధిత డైమిథైల్‌బుటిలమైన్ డ్రగ్ తీసుకున్నట్లు మన్‌ప్రీత్ యూరిన్ ఎ శాంపిల్స్‌లో రుజువైందని జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధికారి వెల్లడించారు.
ప్రస్తుతానికి ఆమెపై నిషేధాన్ని విధించలేదని పేర్కొన్నారు. 'బి' శాంపిల్స్‌ను కూడా పరీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఓ అథ్లెట్ డైమిథైల్‌బుటిలమైన్ డ్రగ్ వాడినట్లు తేలడం ఇటీవలికాలంలో ఇదే తొలిసారి. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలకు ముందు క్రీడాకారులు ఎక్కువగా ఈ డ్రగ్‌ను తీసుకునేవారని అథ్లెటిక్స్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు డైమిథైల్‌బుటిలమైన్ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిర్దేశించిన జాబితాలో లేకపోవడంతో ఆమె ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశాలున్నాయంటూ అథ్లెటిక్స్ వర్గాలు అంటున్నాయి. లండన్ వేదికగా జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మన పతక అవకాశాలను దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. ఈ అంశంలో ఏం జరుగుతుందో చూద్దాం అని జాతీయ అథ్లెటిక్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇక మన్‌ప్రీత్ కోచ్, ఆమె భర్త కరమ్‌జీత్ మాట్లాడుతూ ఈ అంశంపై తమకెలాంటి సమాచారం రాలేదని చెప్పాడు.