నా తల్లిదండ్రులు రోజుకూలీలు, పసిడి గెలిచా: ఉద్యోగం ఇవ్వండని ఓ అథ్లెట్
హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మహిళల 1500 మీటర్ల రేసులో పీయూ చిత్ర పసిడి పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. వర్షంలో కూడా చిరుతలా ఒక్కో అడుగు లంఘించుకుంటూ 1500 మీటర్ల రేసును 4 నిమిషాల 17.92 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది.
తద్వారా చిత్ర గతంలో తన వ్యక్తిగత బెస్ట్‌ని సవరిస్తూ ఆగస్టులో లండన్‌లో వేదికగా జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించింది. పసిడి సాధించిన అనంతరం చిత్ర మీడియాతో మాట్లాడింది. "పసిడి గెలుస్తానని అనుకోలేదు. నా వ్యక్తిగత బెస్ట్ 4నిమిషాల 24 సెకన్లు. గతేడాది దీనిని నెలకొల్పా. ఈసారి ఫెడరేషన్ కప్‌లో స్వర్ణంతో జాతీయ జట్టులోకి వచ్చా" అని తెలిపింది.
"ఈ రేసులోకి వచ్చే ముందు నాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆరంభంలో కాస్త వెనుకబడ్డా.. చివరి 250 మీటర్లలో నాలో సరికొత్త ఉత్సాహం మొదలైంది. అంతే ఫినిషింగ్ లైన్ నా దగ్గరకే వచ్చేసింది. ఇప్పటికీ దీనిని నమ్మలేకపోతున్నా. అసియా పరుగుల రాణి అందరూ పిలుస్తుంటే ముద్దుగా ఉంది" అని చిత్ర వ్యాఖ్యానించింది.
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో చిత్ర అద్భుత ప్రదర్శన చేయడంతో భువనేశ్వర్‌లో ఆమె కోచ్ సిజిన్ పేరు మార్మోమోగిపోయింది. కానీ చిత్ర పరుగును ఆయన కళ్లారా చూడకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే అతను అధికారిక కోచ్ కాకపోవడం, పాస్ లేకపోవడంతో సిజిన్‌ను స్టేడియంలోకి అనుమతించలేదు.

కోచ్ గురించి ఇలా
అయితే పరుగు ముగిసిన తర్వాత తన కోచ్ గురించి ఆమె మాట్లాడుతూ "నా కోచ్ ఎన్నో కష్టాలకు ఓర్చి ముండూర్ నుంచి ఇక్కడిదాకా వచ్చాడు. నన్నెంతో ప్రోత్సహించాడు. కానీ రేసు తర్వాత అతనితో మాట్లాడలేకపోయా. డోప్ టెస్టుకు ముందు ఒక్కసారి మాట్లాడా. ఆ తర్వాత అవకాశమే రాలేదు. కోచ్‌లకు ఇచ్చే అధికారిక పాస్ అతనికి లేదు. నా గెలుపులో ముఖ్య పాత్ర అతనిదే" అని చిత్ర ఆవేదన వ్యక్తం చేసింది.

చాలా సంతోషంగా ఉంది
గత పదేళ్లుగా పియూ చిత్ర తన వద్దే శిక్షణ తీసుకుంటుందని సిజిన్ తెలిపారు. "ముండూర్ హైస్కూల్‌లో నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ని. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నాలాంటి సామాన్య ఉపాధ్యాయుడు ఎన్నో కలలు కంటాడు. ఒక పీఈటీ అతి తక్కువ వసతుల్లో ఓ అథ్లెట్‌ను అంతర్జాతీయ క్రీడాకారిణిగా తీర్చిదిద్దగలడని నమ్మకం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది" అని సిజిన్ వ్యాఖ్యానించారు.

ముండూర్‌లో జన్మించిన చిత్ర
కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని ముండూర్‌లో చిత్ర జన్మించింది. రోజుకూలీలుగా పని చేస్తున్న తల్లిదండ్రులకు చేదోడుగా నిలువాలంటే ముందుగా ఉద్యోగం సంపాదించాలని చిత్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వెసులుబాటుతో పాటు కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చనే ఆలోచనలో ఉంది. చిత్రతో పాటు మరో ముగ్గురు అమ్మాయిలు ఉండటంతో ప్రస్తుతం ఈ కుటుంబం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది.

ఉద్యోగం ఇవ్వండి
ఈ క్రమంలో "త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని ఆశిస్తున్నా. నా లక్ష్యం కూడా అదే. నా శక్తి మేరకు కష్టపడుతా. కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తానన్న నమ్మకం ఉంది. నా ప్రదర్శనను ఇతరులు గుర్తిస్తే చాలు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శన చేసేందుకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నా" అని చిత్ర పేర్కొంది.

మూడో అథ్లెట్‌గా చిత్ర అరుదైన ఘనత
ఇదిలా ఉంటే కేరళ నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన మూడో అథ్లెట్‌గా చిత్ర అరుదైన ఘనత సాధించింది. గతంలో ఓపీ జైశా, ప్రీజా శ్రీధరన్‌లు 1500 మీటర్లలో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications