44 దేశాలు.. 800 మంది అథ్లెట్లు: టాప్ 3 లక్ష్యంగా భారత్
హైదరాబాద్: భారత్ వేదికగా ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు తెరలేచింది. నాలుగు రోజుల పాటు సాగే పోటీలు బుధవారం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హతే లక్ష్యంగా జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం 44 దేశాల నుంచి 800 మంది అథ్లెట్లు 42 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు.
పతకాల పట్టికలో మూడో స్థానమే లక్ష్యంలో భారత్ బరిలోకి దిగుతోంది. నాలుగురోజుల పాటు జరిగే ఈ అతిపెద్ద ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వడం భారత్‌కిది మూడోసారి. ఇంతకుముందు 1989లో ఢిల్లీ వేదికగా, 2013లో పుణె ఆతిథ్యంలో ఆసియా అథ్లెటిక్స్ జరిగాయి.
అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఎఫ్) అధ్యక్షుడు సెబాస్టియన్ కో, భారత అథ్లెటిక్స్ సంఘం చీఫ్ అడిల్లె సమరివాలా, కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తదితరులు హాజరైన కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పోటీలు ప్రారంభమైనట్లు ప్రకటించారు.

భారత్ నుంచి అత్యధికంగా 95మంది అథ్లెట్లు
ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ సంగీత దర్శక త్రయం శంకర్-ఎహ్‌సాన్-లాయ్ రూపొందించిన రంగబతి అనే సంబల్‌పురి జానపద గీతానికి కళాకారులు చేసిన నృత్యాలు కట్టిపడేశాయి. ఆతిథ్య భారత్ నుంచి అత్యధికంగా 95మంది అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ఎప్పట్లాగే ఈసారి కూడా చైనా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 50 మందితో కూడిన బలమైన జట్టుతో చైనా పోటీలకు వచ్చింది.

జపాన్ కూడా పెద్ద మొత్తంలో
జపాన్ కూడా అంతే మందితో బరిలోకి దిగుతోంది. వీటితో పాటు ఖతార్, కొరియా కూడా పతకాలకు గట్టి పోటీదార్లే. రెండేళ్ల కిందట వుహాన్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణాలు నెగ్గిన 14 మంది స్టార్ అథ్లెట్లు ప్రస్తుత టోర్నీలోనూ బరిలోకి దిగుతున్నారు.

చూడదగ్గ అథ్లెట్లు వీరే
రియో ఒలింపిక్స్ హ్యామర్ త్రో స్వర్ణ విజేత దిల్షాద్ నజరోవ్ (తజకిస్థాన్), హైజంపర్ జాంగ్ గౌవీ (చైనా), పోల్ వాల్టర్ లి లింగ్ (చైనా), 400 మీటర్లు హర్డిల్స్ సంచలనం అబ్దుల్ రెహమాన్ సాంబా, ఖతార్ స్టార్ స్ప్రింటర్ ఫెమి ఒగునోడ్ టోర్నీలో చూడదగ్గ అథ్లెట్లు.

పాకిస్థాన్ నుంచి 6గురు అథ్లెట్లు
దాయాది పాకిస్థాన్ నుంచి 6గురు అథ్లెట్లు బరిలో ఉన్నారు. గత ఎడిషన్‌లో 13 పతకాలు (4 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలు) సాధించిన భారత్ ఈసారి సొంతగడ్డపై వీలైనని ఎక్కువ పతకాలు సాధించాలనే లక్ష్యంతో మొత్తం 95 మంది అథ్లెట్లు (49 మంది పురుషులు, 46 మంది మహిళలు)తో బరిలోకి దిగుతోంది.

గతేడాది మూడో స్థానంలో నిలిచిన భారత్
గతేడాది మూడో స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి కూడా అదే స్థానంపై కన్నేసింది. అయితే పతకాల సంఖ్య పెంచుకోవాలన్న పట్టుదలతో ఉంది. కనీసం 5 స్వర్ణాలు, మొత్తంగా 20 దాకా పతకాలు సాధించాలని లక్ష్యంగా భారత బృందం బరిలోకి దిగుతోంది.

గురువారం నుంచి ప్రధాన పోటీలు
ప్రధానంగా నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), మన్‌ప్రీత్ కౌర్ (మహిళల షాట్‌పుట్), పురుషులు, మహిళల 4*400 మీటర్ల రిలే జట్లపై స్వర్ణ పతక ఆశలున్నాయి. వీళ్లతోపాటు వికాస్ గౌడ (డిస్కస్ త్రో), అన్నూరాణి (జావెలిన్ త్ర, ద్యుతీ చాంద్ (100 మీటర్ల స్ప్రింట్)లపైనా పతక అంచనాలున్నాయి. గురువారం నుంచి ప్రధాన పోటీలు జరుగుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications