చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. సెమఫైనల్లో భారత్ చేతిలో ఓడిన బంగ్లా.. మూడో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ లో పాకిస్తాన్ ను ఢీకొంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది. ఐదు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి కేవలం 48 పరుగులు మాత్రమే చేసింది.
మ్యాచ్ ఇలాగే సాగితే బంగ్లా ఈజీగా పైచేయి సాధించేలా కనిపించింది. అయితే వర్షం ఆ టీమ్ ఆశలపై నీళ్లు చల్లింది. భారీ వర్షం పడటంతో మొదటి ఇన్నింగ్స్ ఆ తర్వాత సాగలేదు. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాకు పెద్ద కష్టం వచ్చింది. ఈ టీమ్ 5 ఓవర్లలో ఏకంగా 65 పరుగులు చేయాల్సి వచ్చింది.

ఇలాంటి సమయంలో బంగ్లా ప్లేయర్ అఫీఫ్ హుస్సేన్ ( 11 బంతుల్లో 20) జట్టును పోటీలో ఉంచే ప్రయత్నం చేశాడు. అయితే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ లో అవకాశం దక్కని యాసిర్ అలీ (16 బంతుల్లో 34) ఆ టీంను విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్లో బంగ్లా గెలవాలంటే 20 పరుగులు కావలసి వచ్చింది.
ఈ క్రమంలో యాసిడ్ అలీ కేవలం నాలుగు బంతుల్లో 18 పరుగులు చేసి రాణించాడు. కానీ ఆ తర్వాతి బంతికే అలీ అవుటయ్యాడు. దీంతో పాక్ టీమ్ ఊపిరి పీల్చుకుంది. తాము గెలవడం ఖాయం అనుకుంది. కానీ చివర్లో వచ్చిన రకిబుల్ హాసన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాది.. బంగ్లాకు విజయాన్ని అందించాడు.
ఈ గెలుపుతో బంగ్లా.. ఈ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. ఫైనల్ లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో నెగ్గిన టీంకు స్వర్ణం దక్కుతుంది. ఓడిన జట్టు రజతంతో సరిపెట్టుకుంది.