ముంబయి: అర్జున ఆవార్డు గ్రహీత రెజ్లర్, పంజాబ్ పోలీసు అధికారి జగదీష్ సింగ్ నిషేదిత మత్తు పదార్థాలను కలిగి ఉన్నాడనే ఆరోపణపై అరెస్టయినట్లు అధికార వర్గాలు మంగళవారం చెప్పారి. అతని వద్ద ఉన్న దాదాపు 20 కోట్ల రూపాయల డ్రగ్స్ ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్ నియంత్రణ బ్యూరో దాడి చేసి 25 కిలోల మిథాంఫెటామిన్ ను అతని నుంచి స్వాధీనం చేసుకుంది.
జగదీష్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రెజ్లర్. 1998లో ఆయనకు అర్జున్ అవార్డు వచ్చింది. పంజాబ్ పోలీసు విభాగంలో ఇన్ స్పెక్టర్ అయిన ఆయన ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు. అతను, అతని అనుచరులు హర్వీందర్ సింగ్, హర్జీందర్ సింగ్, వీర్ బహదూర్ సింగ్ పంజాబ్ నుంచి ఆదివారం ముంబయికి వచ్చారు. ముంబయి శివారులోని ఒక హోటల్లో దిగారు.
డ్రగ్స్ ను చేతులు మారుస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు నార్కోటిక్ నియంత్రణ బ్యూరో అధికారులు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. గోర్ గావ్ శివారులో గుర్తు తెలియని వ్యక్తులకు వాటిని అందిస్తుండగా సోమవారం సాయంత్రం అరెస్టు చేసారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. వారిని ఈ నెల 12వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.